
మంత్రి ప్రకటనలో స్పష్టత కరువు
లక్ష్మీపురం: నెల రోజుల కిందటే సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ స్పందించకుండా, ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ మంత్రి శనివారం ప్రకటన చేశారని, జీతాలు ఎప్పటి నుంచి పెంచుతామన్నారని కానీ, ఎంత పెంచుతారని కానీ స్పష్టత లేనందునే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ – ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గుంటూరు తక్కెళ్లపాడు హెడ్‌వాటర్ వద్ద ఆదివారం కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభంతో నగరపాలక సంస్థకు చెందిన ఉండవల్లి, మంగళగిరి, సంగం జాగర్లమూడి, తక్కెళ్లపాడు హెడ్ వాటర్ కార్మికులు సమ్మెలోకి దిగడంతో గుంటూరు నగరానికి నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. మున్సిపల్ అధికారులు సమ్మె చేస్తున్న కార్మికులపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్ప డినా పారిశుద్ధ్య కార్మికులను కూడా సమ్మెలోకి దింపుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు జీవో నంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాల అమలు, ఇంజనీరింగ్ కార్మికుల కేటగిరీల నిర్ధారణలో జరిగిన తప్పులు సరి చేయడం, గత 17 రోజుల సమ్మె ఒప్పందాలకు జీవోలు ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో యూని యన్ నగర అధ్యక్షులు పూనేపల్లి శ్రీని వాసరావు, జిల్లా నాయకులు పాశం పూర్ణచంద్రరావు, ఇంజినీరింగ్ విభాగం నాయకులు యా సిర్ ఖాన్, బాలకృష్ణ, రవి, జానీ, నాగరాజు, మహేష్, సురేష్, లీక్ వర్కర్లు పాల్గొన్నారు.
గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్
తెనాలి రూరల్: దురలవాట్లకు బానిసలై జల్సాలకు డబ్బు కోసం గంజాయి విక్రయిస్తున్న నలుగురును రూరల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఆర్. ఉమేష్ వివరాలను వెల్లడించారు. రూరల్ పరిధిలోని జగ్గడిగుంటపాలెం టిడ్కో గృహ సముదాయం వద్ద గంజాయి విక్రేతలు ఉన్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఐ ఆనంద్, సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి చేసినట్లు చెప్పారు. డెప్యూటీ తహసీల్దార్ కేవీఎస్ ప్రసాద్, పెదరావూరు, జగ్గడిగుంటపాలెం వీఆర్వోల సమక్షంలో కఠెవరం గ్రామానికి చెందిన ముక్కాల ప్రకాశరావు, పెదరావూరు పెదమాలపల్లెకి చెందిన దర్శి ప్రదీప్‌కుమార్, చినపరిమి రోడ్డులో ఉండే నలిగల శివ నాగరాజు, తెనాలి రైల్వే క్వార్టర్స్‌కు చెందిన మెరుగుమాల ప్రశాంత్‌కిరణ్‌లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరంతా దురలవాట్లకు బానిసలైనట్లు తెలిపారు. విజయవాడకు చెందిన ఇమ్మానుయేలు నుంచి రూ 5వేలు, రూ.10వేలకు గంజాయి కొనుగోలు చేసి బస్టాండ్, రైల్వేస్టేషన్, తెనాలి పరిసర గ్రామాలలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. వీరికి గంజాయి సరఫరా చేస్తున్న ఇమ్మానుయేలుపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. గత రెండు నెలల్లో గంజాయి కేసుల్లో పది మందిని అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్‌ఐ కె. ఆనంద్, హెడ్ కానిస్టేబుల్ విజయ్, కానిస్టేబుళ్లు డి. రవి, బీహెచ్. సుబ్బారెడ్డి, లంక వరప్రసాద్, ఓంకార్ కపూర్ నాయక్ పాల్గొన్నారు.
బైక్ అదుపుతప్పి
యువకుడి మృతి
మేదరమెట్ల (అద్దంకి రూరల్): అధికవేగంతో వెళుతున్న యువకుడు బైకు అదుపుతప్పి కిందపడి మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. మేదరమెట్ల పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం మండలంలో కొరిశపాడు గ్రామానికి చెందిన పాలేటి రాజేష్(22) ఒంగోలు వైపు నుంచి వస్తుండగా తమ్మవరం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద అధిక వేగంతో వచ్చి అదుపుతప్పి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతికి గల వివరాలు సేక రించారు.

మంత్రి ప్రకటనలో స్పష్టత కరువు