
పేరుకే పొత్తు.. పదవులిస్తే ఒట్టు!
నరసరావుపేట: నియోజకవర్గంలోని కో ఆపరేటివ్ సొసైటీల అధ్యక్షుల నియామకంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మాన్ని మరిచింది. మొత్తం తొమ్మిది సొసైటీ చైర్మన్ పదవులలో ఒక్కటి కూడా కూటమి పార్టీలైన జనసేన, బీజేపీలకు ఇవ్వలేదు. తమ పార్టీ వర్గీయులకే కట్టబెట్టుకుంది. దీనిపై జనసేన వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. బయటపడి ప్రశ్నించిన వారిని పార్టీ అధినేత సస్పెండ్ చేస్తుండటంతో నేతలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.
నాయకుల మధ్య కొరవడిన సఖ్యత
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ వర్గీయుల మధ్య సఖ్యత ఎప్పుడూ కనిపించలేదు. బీజేపీ తరఫున రంగిశెట్టి రామకృష్ణ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా... ఆయనతో తమకు సంబంధం లేదని ఆ పార్టీ వర్గీయులు బహిరంగంగానే చెబుతున్నారు. జనసేన వర్గీయుల పరిస్థితి కూడా అదే. ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు ఒక్క ఎంపీ కార్యక్రమాలకు తప్పితే మరెక్కడా పాల్గొనటం లేదు. ఏ పని ఉన్నా ఆయన వద్దకే వెళుతున్నారు. స్థానిక టీడీపీ ముఖ్యనేత జనసేన కార్యాలయానికి వెళ్లి మాట్లాడి వచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు. కార్యకర్తల స్థాయిలో ఒకరిద్దరు తప్పితే ఎవరూ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు.
బీసీ వర్గానికీ ఒక్కటీ లేదు...
టీడీపీ వారు మాత్రం ఏ కార్యక్రమం తలపెట్టినా కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. తీరా పదవులు పందేరం విషయంలో మాత్రం పొత్తు ధర్మాన్ని మరిచి వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు సామాజిక న్యాయానికి పాతరేశారని విమర్శలు వస్తున్నాయి. మొత్తం తొమ్మదింటిలో ఏడు సొసైటీలకు టీడీపీకి కొమ్ము కాసే ప్రధాన సామాజికవర్గానికి కేటాయించగా, మిగతా రెండూ ఇతర కులాలకు దక్కాయి. సామాజిక న్యాయం పాటించకుండా మొత్తం తొమ్మిది సొసైటీలు ఓసీలకే అప్పగించారు. బడుగు, బలహీన వర్గాలు ముఖ్యంగా బీసీ వర్గీయులకు ఒక్కటీ దక్కలేదు. తమకు తొలి నుంచి కనీస ప్రాధాన్యత కూడా దక్కడం లేదనే ఆవేదనలో అటు జనసైనికులు, ఇటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పై స్థాయిలో తమ ప్రయోజనాల కోసం కనీసం పట్టించుకోకపోవడంతోనే తమను పదవుల పంపకం సహా అన్నింటా తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు.
బాధ్యతలు స్వీకరించింది వీరే...
నూతనంగా నియమితులైన చైర్మన్లు, మెంబర్లకు శనివారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు నియామక పత్రాలు అందజేశారు. చైర్మన్లుగా కన్యధారరాజు (లింగంగుంట్ల), యర్రం రాంబాబు (జొన్నల గడ్డ), కొల్లి వెంకటేశ్వర్లు (ఇక్కుర్రు), జల్లిపల్లి శేషమ్మ (విప్పర్ల),పొనుగోటి శ్రీనివాస రావు (సంతగుడి పాడు), సూరాబత్తుల రామారావు (బుచ్చిపాపన పాలెం), పల్లెల వెంకట రత్నారెడ్డి (రొంపిచర్ల), కుందేటి రామబ్రహ్మం (అన్నవరం), ఇంటూరి వెంకట ప్రసాద్ (సుబ్బయ్య పాలెం) స్వీకరించారు. వీరిలో కొంతమంది ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి టీడీపీ కార్యాలయానికే రాలేదని, కానీ పదవులు మాత్రం దక్కాయని చెబుతున్నారు. పదవులు అన్ని పార్టీలకు సమానంగా ఇవ్వాలనే నిబంధనను టీడీపీ గాలికి వదిలేసిందని పలువురు విమర్శిస్తున్నారు.
కూటమిలో పొత్తు ధర్మం
పాటించని టీడీపీ
ఏకపక్షంగా సహకార సొసైటీ
చైర్మన్ల నియామకం
జనసేన, బీజేపీ వర్గీయులకు
దక్కని పదవులు
ఒక్క కులానికే ‘పచ్చ’ పార్టీ
అత్యధిక ప్రాధాన్యం