
కాసుల కక్కుర్తి.. నాణ్యత నాస్తి
రేపల్లె: ప్రధాన పంట, మురుగు కాలువల మరమ్మతులకు ప్రభుత్వం కేటాయించిన నిధులు నామమాత్రపు పనులతో కూటమి నాయకుల జేబులు నింపుతున్నాయి. కూటమి నేతలే గుత్తేదారుల అవతారమెత్తి పనులు చేజిక్కించుకుని అందినకాడికి దోచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంట కాల్వలకు తూతూ మంత్రంగా మరమ్మతులు నిర్వహించి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పది రోజులైనా ఆ పనులు ప్రజలకు ఉపయోగపడలేదు.
కూటమి నేతలే కాంట్రాక్టర్లుగా...
కృష్ణా డెల్టా పరిధిలోని తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాలలోని మేజర్, మైనర్ పంట కాల్వల అభివృద్ధి, పూడికతీతకు ప్రభుత్వం నుంచి రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటితో మూడు నియోజకవర్గాల పరిధిలోని కాల్వలలో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూటికాడను తీయిస్తూ... కాలువలను బాగు చేయించటం, బలహీనంగా ఉన్న కట్టలను బలోపేతం చేయడం వంటి పనులను చేయిస్తున్నారు. ఆయా పనులకు సంబంధించి బాధ్యతలను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అప్పజెప్పటంతో నాసిరకంగా నిర్వహించారు. ప్రజాధనం కొల్లగొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేపల్లె నియోజకవర్గంలోని అరవపల్లి మెయిన్ కెనాల్ పంట కాలువ లాకుల వద్ద 10 రోజుల క్రితం కట్టను బలపరిచారు. వెదురు బద్దలు ఏర్పాటు చేసి ఇసుక బస్తాలను అడ్డుపెట్టి మమ అనిపించారు. వారం క్రితం కెనాల్‌కు కొద్దిపాటి నీరు రావటంతో అరవపల్లి వద్ద ఇసుక బస్తాలు కొట్టుకుపోయాయి. పూర్తిస్థాయిలో నీరు రాకముందే చేసిన అభివృద్ధి నీటిపాలవ్వటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పనులను పర్యవేక్షించి నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు. బలహీన పడిన కట్టలను బలపరచాలని కోరుతున్నారు.
ఇంకా పనులు చేయాల్సినవి..
రేపల్లె సబ్ డివిజన్‌లో ప్రధానంగా ఉన్న ఆర్‌ఎం డ్రెయిన్ , బీఎం డ్రెయిన్ , జగజ్జేరువు కాలువ, రేపల్లె మురుగు కాలువ, వాడమూరుగు డ్రెయిన్, రేపల్లె న్యూకోర్స్, ఓల్డ్‌కోర్స్, అరవపల్లి మెయిన్ కెనాల్ ఉన్నాయి. ఈ పంట కాల్వలలో తూటి కాడ, గుర్రపు డెక్క, ప్లాస్టిక్, చెత్తాచెదారాలతో పూడుకుపోయాయి. ఈ కాలువల ద్వారానే పంట పొలాల నుంచి వర్షపు నీరు బయటకు పోవాల్సి ఉంటుంది. రేపల్లె నియోజకవర్గంలోని రేపల్లె, రేపల్లె మండలం, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాలలో 34,060 హెక్టారులలో ఖరీఫ్‌లో వరి సాగు అవుతోంది. ఈ సాగు భూముల్లోని వృథా నీరుతోపాటు అధిక వర్షాలు కురిసిన సమయంలో వర్షపునీరు ఈ కాలువల ద్వారానే బయటకు వెళ్లాలి. ఇందులో భాగంగా చేపట్టిన తొలి విడత పనుల్లోనే కూటమి నేతల కాసుల కక్కుర్తికి పనులన్నీ వృథా అయ్యాయి.
అరవపల్లి వద్ద కెనాల్‌లో నీటి ఉద్ధృతికి కోసుకుపోయిన కాల్వ కట్ట
ఆ పనులు మళ్లీ చేయిస్తాం
కాలువల మరమ్మతులలో భాగంగా అరవపల్లి కెనాల్‌లో లాకుల వద్ద బలపరిచిన కట్టలు నీటి ఒరవడికి కోసుకుపోవటాన్ని పరిశీలించాం. పనులకు సంబంధించి కాంట్రాక్టర్‌లకు బిల్లులు ఇవ్వలేదు. మళ్లీ కట్టలు పటిష్ఠం చేయాలని ఆదేశించాం. మరమ్మతులను దగ్గరుండి పర్యవేక్షిస్తాం. నాణ్యతాలోపాలు లేకుండా చూస్తాం.
– దీనదయాళ్,
డీఈ, ఇరిగేషన్ శాఖ, రేపల్లె
కాలువ మరమ్మతులు, అభివృద్ధి
పనులలో నాణ్యతాలోపాలు
అధికారుల పర్యవేక్షణ లోపంతో
గుత్తేదారుల ఇష్టారాజ్యం