
రాష్ట్రంలో రాక్షస పాలనకు తెరతీసిన టీడీపీ నేతలు
సత్తెనపల్లి: రాష్ట్రంలో ఏడాది నుంచి రాక్షస పాలన కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది రాజారపు శివనాగేశ్వరరావు ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, బీసీ మహిళ ఉప్పాల హారిక, ఆమె భర్త రాముపై టీడీపీ గూండాలు రాళ్లు, కర్రలు, రాడ్‌లతో దాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు. కారును ముందుకు కదలనీయకుండా రోడ్డుపై దాడి చేయడం అప్రజాస్వామికమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ మహిళలపై దౌర్జన్యాలు, దాడులు ఎక్కువ అయ్యాయనడానికి ఇదొక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పోకడ ఎమర్జెన్సీని తలపిస్తోందని, మహిళలకు రక్షణ లేదని తెలిపారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గుండాలు దాడిచేయడం దారుణమని ఖండించారు. ఒక మహిళ హోం మంత్రి అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇలాంటి దాడులను కూటమి ప్రభుత్వం మానుకోవాలని, లేనిపక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దాడి చేసిన టీడీపీ గుండాలను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని శివనాగేశ్వరరావు డిమాండ్ చేశారు.