
దగాపై రగిలిన రైతన్న
పొగాకుకు గిట్టుబాటు ధర కోరుతూ హైవే దిగ్బంధనం
దాచేపల్లి: ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వ తీరుపై రైతులు మండిపడ్డారు. పొగాకుకు కనీస గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ ప్రభుత్వం తీరును ఎండగడుతూ రోడ్డెక్కారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం, గామాలపాడు గ్రామ పరిధిలోని వేర్‌హౌస్ గోడౌన్స్ వద్ద అద్దంకి –నార్కెట్ పల్లి రహదారిపై పొగాకు రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. పొగాకు ఉత్పత్తులను రోడ్డుపై వేసి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సవాలక్ష ఆంక్షలు
పొగాకు రైతులు తమ ఉత్పత్తులను గామాలపాడులోని వేర్‌హౌస్ గోడౌన్‌కు తేవాల్సిందిగా సంబంధిత బయ్యర్లు, సూపర్‌వైజర్లు సమాచారం ఇచ్చారు. వీరి సమాచారం మేరకు జిల్లావ్యాప్తంగా ఉన్న పొగాకు రైతులు తమ ఉత్పత్తులతో అక్కడికి చేరుకున్నారు. అయితే తాజాగా తీసుకొచ్చిన పొగాకు నాసిరకంగా ఉందని, రూ.3వేలకు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం.. అంతేకాకుండా ఒక రైతు నుంచి ఒకటి, రెండు బేళ్ల పొగాకు మాత్రమే కొంటామని చెప్పి, మిగతావి నాసిరకంగా ఉన్నాయని చెప్పి తిరస్కరించడంతో రైతులు ఆగ్రహించారు. బయర్ల తీరును నిరసిస్తూ పక్కనే ఉన్న హైవేపై ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనలతో హైవేపై భారీస్థాయిలో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
రైతులతో అధికారుల చర్చలు
దాచేపల్లి: గిట్టుబాటు ధర కల్పించాలని ఆందోళన చేపట్టిన రైతులతో అధికారులు చర్చించారు. రైతుల ఆందోళన విషయం జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ, దాచేపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలులు గామాలపాడు చేరుకుని రైతులతో మాట్లాడారు. గతంలో ఇచ్చిన ధర, ప్రస్తుతం ఇస్తున్న ధరల వ్యత్యాసంపై రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. తాము తీసుకువచ్చిన పొగాకు అంతటిని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులు కోరారు. గాడ్ ఫ్రై ఫిలిప్స్ ఇండియా కంపెనీ ప్రతినిధులతో అధికారులు మాట్లాడారు. సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ మురళీకృష్ణ రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
బేలుకు రూ.3వేలు మాత్రమే ఇస్తామంటున్న బయ్యర్లు ఇష్టమైతే అమ్మండి.. లేదంటే పోండంటూ బెదిరింపులు పొగాకు బేళ్లను రోడ్డుపై వేసిప్రభుత్వ తీరుపై నిరసన ప్రభుత్వం మోసం చేసిందని రైతుల మండిపాటు ఆందోళన చేస్తున్నరైతులపై పోలీసుల దురుసు ప్రవర్తన
రైతులతో దురుసు ప్రవర్తన
పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. రైతులతో సీఐ భాస్కర్, ఎస్‌ఐలు పాపారావు, సౌందర్యరాజన్‌లు దురుసుగా మాట్లాడి బలవంతంగా అక్కడి నుంచి లేపారు. పోలీసుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. బయ్యర్లు తమ పరిధిలో ఏమీ లేదని చేతు లెత్తేశారు.

దగాపై రగిలిన రైతన్న