
జెడ్పీ చైర్‌పర్సన్ హారికపై దాడి అమానుషం
వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్
చిలకలూరిపేట: బీసీ మహిళా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై రాళ్లు, కర్రలతో టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడడం అమానుషమని పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు కందుల శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడారు. బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ సభకు వెళుతుండగా కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలో దాడికి పాల్పడడాన్ని ఖండించారు. ప్రభుత్వ తీరును సభ్య సమాజం తీవ్రంగా అసహ్యించుంకుంటున్నదని వెల్లడించారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనే ప్రభుత్వ విధానం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని విమర్శించారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించేవారే ఉండకూడదన్నట్లు వ్యవహరించటం ప్రజాస్వామ్య విధానాలకు పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. ప్రశ్నించటం, నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటివని, వాటిని కాలరాయాలని చూస్తే తీవ్ర ప్రజావ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. దుర్ఘటనకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.