
మహిళల పాలిట నరకాసుర పాలన
వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ దేవళ్ల రేవతి
దాచేపల్లి : రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ దేవళ్ల రేవతి అన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై దాడిని ఆదివారం ఆమె తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పాలన మహిళల పాలిట నరకాసుర పాలనగా మారిందని ధ్వజమెత్తారు. మహిళలకు కనీస రక్షణ ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల మహిళా ప్రజాప్రతినిధులను మానసికంగా వేధించి, భౌతిక దాడులు చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోందని రేవతి మండిపడ్డారు. మహిళా ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం రక్షణ ఎక్కడ ఇస్తుందని ఆమె ప్రశ్నించారు. టీడీపీ గూండాలు హారికపై దాడి చేసి చంపేస్తామని బెదిరించడం దారుణమైన ఘటనగా పేర్కొన్నారు. దీనిపై ప్రతి ఒక్కరు స్పందించి ప్రభుత్వ తీరుని ఎండగట్టాల్సిన ఆమె పిలుపునిచ్చారు. బీసీ మహిళ అయినా హారికపై దాడికి హోంమంత్రి బాధ్యత వహించి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రేవతి డిమాండ్ చేశారు.