సీపీఎం నాయకునిపై టీడీపీ నేతల దాడి హేయం | - | Sakshi
Sakshi News home page

సీపీఎం నాయకునిపై టీడీపీ నేతల దాడి హేయం

Jul 14 2025 4:51 AM | Updated on Jul 14 2025 4:51 AM

సీపీఎం నాయకునిపై టీడీపీ నేతల దాడి హేయం

సీపీఎం నాయకునిపై టీడీపీ నేతల దాడి హేయం

నరసరావుపేట: క్రోసూరు మండలం దొడ్లేరు గోదావరి చైతన్య గ్రామీణ బ్యాంకులో బంగారం పోగొట్టుకున్న బాధిత రైతుల పక్షాన పోరాటం చేస్తున్న సీపీఎం నాయకుడు తిమ్మిశెట్టి హనుమంతరావుపై దాడికి పాల్పడిన తెలుగుదేశం నాయకులు(బంగారం వ్యాపారులు)లను తక్షణమే అరెస్ట్‌ చేయాలని ఆ పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు వైఖరి, పోలీసుల తీరును ఖండిస్తూ కరపత్రం ఆవిష్కరించారు. విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ పీడిత వర్గ ప్రజల పక్షాన నిలిచి నిస్వార్థంగా పోరాటాలు చేస్తున్న నాయకులపై అధికార పార్టీ వర్గీయులు దాడికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే మొఘల్‌ జాన్‌ను మండల అధ్యక్ష స్థానం నుంచి తప్పించి పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలన్నారు. రైతులు తనఖా పెట్టిన బంగారం గోల్‌మాల్‌ కావడంలో అప్రైజర్‌ నాగార్జునతో దాడికి పాల్పడిన ఘటనలో టీడీపీ నాయకుల హస్తం ఉందని అందుకే పోరాటాన్ని నీరుగార్చేందుకు దాడికి పాల్పడ్డారన్నారు. దీనిపై తమ పార్టీ రెండేళ్ల్ల పోరాటం ఫలితంగా 400 మంది బాధితులకు న్యాయం జరిగిందని, మిగిలిన 140 బాధితులకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్న క్రమంలో టీడీపీ నాయకులు దాడికి పాల్పడడం, పోలీసులు వారికే వత్తాసు పలకడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ నెల 10న బ్యాంక్‌కు తాళంవేసి పురుగుమందు డబ్బాలతో ఆందోళనకు దిగగా డీఎస్పీ వచ్చి మాట్లాడతారని, ఆందోళన విరమించాలని ఎస్‌ఐ రవికుమార్‌ చెప్పడంతో విరమించారన్నారు. ఆందోళనలో కీలకంగా వ్యవహరించిన తిమ్మిశెట్టి హనుమంతరావుపై అదేరోజు టీడీపీ మండల అధ్యక్షులు మొఘల్‌ జాన్‌, సోదరుడు సమీర్‌లు దారికాచి దాడికి పాల్పడగా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, పోలీసులు అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. క్రోసూరు మండలంలోని పేద ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి హనుమంతరావు కృషిచేయడాన్ని అధికార పార్టీ నాయకులు ఓర్వలేక పోతున్నారన్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని బాధితునికి రక్షణ కల్పించాలని లేని పక్షంలో ఆందోళన చేపడతామన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పీడిత వర్గ ప్రజల రక్షణకు తమ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో బాధిత నాయకుడు తిమ్మిశెట్టి హనుమంతరావు, నాయకులు డి.శివకుమారి, జి.మల్లీశ్వరి, జి.ఉమశ్రీ, సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య, ఏపూరి గోపాలరావు, పెద్దిరాజు, తెలకపల్లి శీను, హరి పోతురాజు, బాలకృష్ణ, సిలార్‌ మసూద్‌, పి వెంకటేశ్వర్లు, లక్ష్మీశ్వరరెడ్డి, హరిపోతురాజు, రాధాకృష్ణ, రవిబాబు పాల్గొన్నారు.

దాడికి పాల్పడిన టీడీపీ నాయకులను అరెస్ట్‌ చేయాలి

బంగారం పోగొట్టుకున్న బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం

సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement