
రక్షణ.. ఆమడదూరం
బాపట్ల: సముద్ర తీరంలో రక్షణ కవచంలా ఉన్న మడ అడవులు క్రమంగా అంతరించిపోతున్నాయి. తీరం కోతకు గురికాకుండా ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని నిలబడే మడ అడవులు నానాటికీ కనుమరుగు అవుతున్నాయి. అటవీశాఖ ఈ మడ అడవుల అభివృద్ధిని గాలికి వదిలేసింది. రాష్ట్రంలో 973 కిలోమీటర్ల మేర విస్తరించిన తీరంలో కనీసం పట్టుమని 500 ఎకరాల్లో కూడా మడ అడవులు లేకపోవటం గమనార్హం.
జీవరాశులపైనా ప్రభావం
సూర్యలంక సముద్ర తీరంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే ప్రధాన డ్రైనేజీలు కలుస్తాయి. వాటికి అనుసంధానంగా ఉండే ఏటి పరివాహక ప్రాంతాల్లో సముద్రపు పోటు నీటితో బతికే మడ అడవులు ఎన్నో జీవరాశు లకు రక్షణగా నిలుస్తున్నాయి. ఇవి అంతరించిపోవటంతో పలు జీవరాశుల్లో కొన్ని కనుమరుగు అవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలైన తుపాన్లు, సునామీలు సంభవిస్తే ఆ ప్రభావం జనావాసాలపై పడకుండా మడ అడవులు తీర రక్షణ గోడగా నిలుస్తున్నాయి.
యథేచ్ఛగా రొయ్యల చెరువుల ఏర్పాటు
తీర ప్రాంత గ్రామాలకు మేలు చేసే వీటిని పరిరక్షించాల్సిన అటవీ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పైగా మడ అడవులను నరికేసి అన్యాక్రాంతం చేసుకున్న తీరంలో రొయ్యల చెరువులు ఏర్పాటవుతున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదు. మడ అడవుల పెంపకం సంగతి పక్కన పెడితే.. ఉన్నవాటిని తొలగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు సముద్ర తీరంలో జీవరాశులకు ఊతంగా నిలిచే అడవులు అంతరిస్తే ఆ ప్రభావం తీర ప్రాంత గ్రామాలపై పడే ప్రమాదం ఉంది. అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలకే పరిమితం అవుతోంది. శ్రీకాకుళం మొదలు నెల్లూరు జిల్లా వరకు విస్తరించిన ఈ అడవుల రక్షణ, అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ప్రభుత్వం కాపాడాల్సిన అవసరం ఉంది.