
దాచేపల్లిలో భూ దందా
సాక్షి టాస్క్‌ఫోర్స్: పల్నాడులో టీడీపీ నేతలు భూ దోపిడీకి పాల్పడుతున్నారు. గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రభుత్వ భూములను అందిన కాడికి దోచుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం గ్రామాల వారీగా ప్రభుత్వ భూములను గుర్తించి రెవెన్యూ అధికారుల ద్వారా రికార్డులను తారుమారు చేసి లక్షలు పోగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేయడం ఇప్పుడు పల్నాడు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో కూటమి నేతలకు సహకరించిన అధికారులు సస్పెన్షన్‌కి గురైన పరిస్థితులు ఉన్నాయి. తాజాగా గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని దాచేపల్లిలో సుమారుగా 27 ఎకరాల ప్రభుత్వ భూములను టీడీపీ నేతలకు ధారాదత్తం చేసిన అప్పటి తహసీల్దారు వైవీబీ కుటుంబరావును జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటంతో రెవెన్యూ అధికారులలో వణుకు మొదలైంది.
ఆన్‌లైన్‌లో టీడీపీ నేతల పేర్లు నమోదు
దాచేపల్లి మండలం కేసానుపల్లి రెవెన్యూ గ్రామంలో భారీ స్థాయిలో ప్రభుత్వ భూములను టీడీపీ నేతలకు కట్టబెట్టారు. సర్వే నెంబర్ 649/4బి2–బితోపాటు మరో సర్వే నెంబర్‌లో పిన్నబోయిన నాగరాజు పేరు మీద 8.22 ఎకరాలు, కిచ్చంశెట్టి పకీరయ్యతోపాటు మరో ఇద్దరిపై 15 సెంట్లు ఆన్‌లైన్‌లో ఎక్కించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఇర్కిగూడెంకు చెందిన కోటిక కొండయ్య అతని భార్య వెంకటరమణ పేరు పై 6.79 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇదే మండలంలోని గామాలపాడులో సర్వే నెంబర్ 348–15–7, 348–15–7లో భూమి కొనుగోలు చేసినట్లుగా నకిలీ రికార్డులు సృష్టించి ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేశారు. భట్రూపాలెంలో సమ్మెట శ్రీనివాసరాజు పేరుతో 5.5 ఎకరాల భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వీటితో పాటుగా పెదగార్లపాడు, మాదినపాడు, గ్రామాల్లో కూడా ప్రభుత్వ, రాళ్లగుట్ట, వాగు పోరంబోకు భూములు కూటమి నేతలకు అప్పనంగా కట్టబెట్టారు. దాచేపల్లితోపాటుగా కారంపూడి, రెంటచింతల, మాచర్ల, వెల్దుర్తి, గురజాల, మాచవరం, పిడుగురాళ్ల, దుర్గి మండలాల పరిధిలో టీడీపీ నేతలు ప్రభుత్వ భూములపై కన్నేసి అక్రమంగా లాగేసుకుంటున్నారు.
ప్రభుత్వ భూములపై టీడీపీ నేతల కన్ను 27 ఎకరాల ప్రభుత్వ భూములు హంఫట్ ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్న నేతలు కోట్లు విలువచేసే భూములు నేతల చేతుల్లోకి.. సహకరిస్తున్న రెవెన్యూ యంత్రాంగం తాజాగా తహసీల్దార్ సస్పెన్షన్

దాచేపల్లిలో భూ దందా