
అక్రమ కేసులతో వేధించేందుకు కుట్ర
సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తనపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని, వాటిపై న్యాయపోరాటం చేస్తున్న నేపథ్యంలో కొత్త కుట్రలకు తెరదీస్తున్నారని పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా మాచర్లలో అక్రమ మైనింగ్ జరిగిందంటూ పచ్చ పేపర్లలో వస్తున్న అసత్య ప్రచారాలపై ఆయన స్పందించారు. ఇప్పటికే తనపై అనేక అక్రమ కేసులు బనాయించారన్నారు. చివరకు తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాల వల్ల వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జంట హత్యలు జరిగితే తనపై అక్రమ కేసు నమోదు చేశారన్నారు. ఆ కేసులో బెయిల్ వస్తుందేమోనన్న అనుమానంతో అక్రమ మైనింగ్ అంటూ కొత్త కుట్రలకు తెరలేపారన్నారు. ఆ మైనింగ్‌తో తనకెలాంటి సంబంధం లేదన్నారు. అబద్ధపు వాంగ్మూలం ఇప్పించి తనను ఇరికించాలని చూస్తున్నారన్నారని వాపోయారు. కూటమి ప్రభుత్వం, జూలకంటి బ్రహ్మారెడ్డిలు మాచర్లలో చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదన్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తాను చేసిన అభివృద్ధిని పక్కదోవ పట్టించేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రజాభిమానాన్ని ఓర్వలేక జాతీయ రహదారి నిర్మాణానికి అక్రమ మైనింగ్ మట్టి వాడారంటూ కొత్త ప్రచారానికి తెరదీశారన్నారు. ఆంధ్రజ్యోతిలో తనపై కావాలనే నిరాధార కథనాలు ప్రచురించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పత్రిక యాజమాన్యంపై హైకోర్టులో పరువునష్టం దావా వేస్తామన్నారు. తనపై రోజుకో అసత్య ఆరోపణ తెరపైకి తెచ్చి వార్తలు రాస్తున్నారని, వారిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. కుట్రలకు భయపడేది లేదని చెప్పారు. ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తానన్నారు.
టీడీపీ నేతల విభేదాలతో జరిగిన జంట హత్యల కేసును నాపై వేశారు అసత్య ఆరోపణలు చేసిన పేపర్‌పై న్యాయ పోరాటానికి సిద్ధం వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి