
సంబరం... ఇంద్ర వైభవం
నయన మనోహరంగా దుర్గమ్మకు శాకంబరి అలంకారం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శాకంబరి ఉత్సవాలు మూడు రోజులపాటు వైభవంగా కొనసాగాయి. పూర్ణాహుతితో ఈ ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. శాకంబరీదేవి అలంకారంలో కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు గురువారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మను నయన మనోహరంగా వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు.
ఉత్సవాలు
పరిసమాప్తం
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మూడు రోజులపాటు జరిగిన శాకంబరి ఉత్సవాలు పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని నూతన యాగశాలలో గురువారం ఉదయం ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఈఓ అన్నదానం పథకానికి రూ. 50 వేల విరాళం సమర్పించారు. ఉత్సవాలలో మూడో రోజున అమ్మవారి మూల విరాట్‌ను వివిధ ఫలాలు, డ్రైఫ్రూట్స్‌తో అలంకరించారు. ఆలయాన్ని బత్తాయి. దానిమ్మ, పైనాపిల్, పచ్చి ఖర్జూరం, ఆల్‌బక్రా, యాపిల్, పుచ్చకాయలు, పలు రకాల ద్రాక్షలతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. మూడు రోజుల ఉత్సవాల్లో 36 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను వినియోగించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
అమ్మ సన్నిధిలో
గురుపూజా మహోత్సవం
వ్యాస పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో గురు పూజా మహోత్సవాన్ని నిర్వహించారు. దేవస్థానానికి చెందిన తంగిరాల వెంకటేశధ్వర ఘనాపాటి, శంకరమంచి శివప్రసాద్, అహితాగ్ని గుంటూరు రామచంద్ర సోమయాజులు దంపతులను సత్కరించి పట్టువస్త్రాలు, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు గురువులకు హారతులిచ్చి పూజ నిర్వహించారు. నగదు బహుమతి ఇచ్చి సత్కరించారు.

సంబరం... ఇంద్ర వైభవం