
ఇష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు..
నరసరావుపేట రూరల్: పాఠశాలను దేవాలయంగా భావించి క్రమశిక్షణతో ఇష్టపడి చదివితే ఎంచుకున్న రంగంలో రాణించవచ్చని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్‌లో గురువారం మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం ఎం.పార్వతి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సృజనాత్మకతతో ఎదిగేందుకు అనువైన వాతావరణం ఉంటుందని తెలిపారు. విద్యార్థుల బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులపై ఉందన్నారు. తమ పిల్లల దినచర్యపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. పిల్లల ఆసక్తిని గమనించి ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహించాలని సూచించారు. మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు, అడిషనల్ ఎస్పీ సంతోష్, ఆర్‌డీఓ మధులత, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎంపీడీఓ టీవీ కృష్ణకుమారి, విద్యాకమిటీ చైర్మన్ ఎం.రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రిటైర్డ్ హెచ్‌ఎం ఎంఎస్‌ఆర్‌కే ప్రసాద్ నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు
లింగంగుంట్ల శంకర భారతీపురం హైస్కూల్‌లో మెగా పేరెంట్స్ మీటింగ్