
అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి మున్సిపల్ ఇంజినీరింగ్ కార్
నరసరావుపేట: ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మికులందరూ శనివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఇంజినీరింగ్ విభాగంలోని వాటర్, లైటింగ్ సెక్షన్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, డ్రైవర్లు, పార్కు, ఫిల్టర్ హౌస్ వర్కర్లు, ట్యాంక్ వాల్ ఆపరేటర్లు (ఇండోర్, అవుట్‌డోర్) అందరూ నిరవధిక సమ్మెకు దిగారు. మున్సిపల్ కార్మికులు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర డిమాండ్లను అమలు చేయాలని శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు సీఐటీయూ నాయకులు, కార్మికులు శనివారం వినతిపత్రం అందజేశారు. తొలుత మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేసి కార్యాలయం వద్ద నుంచి మార్కెట్ మీదుగా మల్లమ్మ, శివుడి బొమ్మ, గడియారం స్తంభం సెంటర్ల మీదుగా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మూడు నెలలుగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని, గత సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని పలుమార్లు అధికారులు, మంత్రులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాని కారణంగా ఈ సమ్మెలోకి వెళుతున్నామని యూనియన్ నాయకులు షేక్ సిలార్ మసూద్, అల్లాభక్షు పేర్కొన్నారు. సమ్మె నోటీసు ఇచ్చినా కార్మిక నాయకులతో చర్చలు జరపకుండా ప్రభుత్వం నిమ్మకు నెరెత్తినట్టు వ్యవహరిస్తుందని విమర్శించారు. సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని, ప్రజలు సానుకూలంగా స్పందించి మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలియజేయాలని కోరారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపునకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ వీధుల వెంట కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సోమశేఖర్, కుంచాల శ్రీను, బాలాజీసింగ్, సకీలా శ్రీను, బత్తుల శ్రీను, కిరణ్‌కుమార్, మురళి, గుడా సామ్రాజ్యం, తీగల వెంకట్, గుంజి వాసు, షేక్ ఖాదర్, గౌస్, మాలిక్ ఎం సురేష్, రంగనాయకులు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
పట్టణంలో ర్యాలీ నిర్వహించిన నాయకులు, కార్మికులు పట్టణ పౌరులు సహకరించాలంటూ కరపత్రాలు పంపిణీ