
ప్రైవేటు పాఠశాలల బంద్ విజయవంతం
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యాహక్కు చట్టం ప్రవేశాల పేరుతో ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు గురువారం విద్యాసంస్థలను మూసివేసి బంద్ పాటించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాలు పిలుపు మేరకు గుంటూరు నగరంతోపాటు జిల్లాలోనూ పాఠశాలలు మూతపడ్డాయి. విద్యాహక్కుచట్టంలోని 12 (1) సీ ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించే విషయంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, సీట్ల కేటాయింపు ప్రక్రియలో ప్రభుత్వం, విద్యాశాఖ పక్షపాత ధోరణితో వ్యవహరించడం, ఫీజుల చెల్లింపు విషయమై స్పష్టత లేకపోవడంతోపాటు విద్యాశాఖాధికారుల బెదిరింపు ధోరణులు, షోకాజ్ నోటీసులు జారీ చేయడం, రాజకీయంగా ఒత్తిడి తెస్తున్న సంఘటనలను యాజమాన్యాలను తీవ్రంగా నిరసిస్తున్నాయి.
సాగర్, పులిచింతలలో చేపల వేట నిషేధం
నరసరావుపేట: జిల్లాలోని లైసెన్సుడ్ రిజర్వాయర్లు నాగార్జున సాగర్, కేఎల్ రావు పులిచింతలలో చేపల సంతానోత్పత్తి సమయమైన జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు (62 రోజులు) వేట నిషేధం అమలులో ఉంటుందని జిల్లా మత్స్యశాఖ అధికారి ఎస్.సంజీవరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రిజర్వాయర్లో లైసెన్సు తీసుకొని వేట కొనసాగించే మత్స్యకారులు ఎవరూ ఆ సమయంలో వేటకు వెళ్లవద్దని, దానికి భిన్నంగా ఎవరైనా వేటకు ఉపక్రమిస్తే వారి లైసెన్సు రద్దుచేసి, అపరాధ రుసుం వసూలు చేస్తామని హెచ్చరించారు.