
దిగొచ్చిన అధికారులు
నరసరావుపేట: ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారంతో 66వ రోజుకు చేరింది. ఆప్కాస్‌లో ఉన్నప్పటికీ వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం, సగం రోజులకే ఇవ్వడాన్ని ప్రశ్నించినందుకు విధులకు హాజరు కావొద్దన్న అధికారుల తీరును నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటివరకు పలు విధాలుగా కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల పోరాట పటిమకు ఎట్టకేలకు దిగొచ్చిన అధికారులు శనివారం సీఐటీయూ నాయకులతో చర్చలు నిర్వహించారు. కమిషనర్ చాంబర్‌లో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్, ఉపాధ్యక్షులు గుంటూరు విజయకుమార్, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి, మండల కార్యదర్శి షేక్ సిలార్ మసూద్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌తో చర్చించారు. కార్మికులను కొనసాగించి మెరుగైన వేతనాలు ఇస్తామని కమిషనర్ ఎం.జస్వంతరావు హామీ ఇచ్చారు. ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ చర్చలు సానుకూలంగా జరిగాయని, సమ్మె కాలానికి కూడా సగం వేతనాలు ఇవ్వాలని, వేతనాల చెల్లింపులు ఆప్కాస్ ద్వారా చేయాలని డిమాండ్ చేశామన్నారు. పట్టణీకరణ పెరిగిన నేపథ్యంలో కొత్తగా కార్మికులను తీసుకోవాలన్న ప్రతిపాదనకు సమ్మెలో పాల్గొన్న కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పోరాటాల ద్వారానే హక్కులు, డిమాండ్లను సాధించుకోవాలని పేర్కొన్నారు.
66వ రోజుకు మున్సిపల్
కార్మికుల నిరవధిక సమ్మె
సీఐటీయూ నాయకులతో
మున్సిపల్ కమిషనర్ చర్చలు
నేటి నుంచి విధుల్లోకి కార్మికులు

దిగొచ్చిన అధికారులు