
ముగిసిన ప్రసన్నాంజనేయుడి జయంత్యుత్సవాలు
బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి జయంతి, కల్యాణ ఉత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు స్వామికి విశేష పూజలు జరిగాయి. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు బొర్రా వెంకట అనంతాచార్యులు స్వామికి సుప్రభాత సేవలతో పూజలు ప్రారంభించారు. అనంతరం లక్ష మల్లె పూలతో విశేష పూజలను నిర్వహించారు. చివరి రోజు భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామికి పొంగళ్లు చేసి, నైవేద్యాలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. రాత్రి రాజుపాలెం గ్రామానికి చెందిన శ్రీ అంకమ్మ తల్లి కళా నాట్యమండలి వారి శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. ఆదివారం ఆలయంలో హుండీని లెక్కించగా జనవరి నుంచి ఈ నెల 25 వరకూ హుండీ ద్వారా రూ. 3,28,366 ఆదాయం వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు ఉత్సవాల నిర్వహణకు సహకరించిన అందరికీ ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తలిపారు. ఉత్సవాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
చివరి రోజు లక్ష మల్లెలతో స్వామికి అభిషేకం