
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
అచ్చంపేట: వుండలంలోని గింజుపల్లి వద్ద కృష్ణానదిలో ఈతకెళ్లిన వ్యక్తి ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. కాగా అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపల పడవల ద్వారా ఈతగాళ్ల సహాయంతో విస్తృత గాలింపు చర్యలు చేపట్టగా రాత్రి 9.30 సమయంలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నకరికల్లు మండలం చాగళ్లు గ్రామానికి చెందిన ఆలపర్తి సైదారావు(43) మాదిపాడు పంచాయతీ పరిధిలోని సత్తెమ్మతల్లి దేవాలయం వద్ద మొక్కుబడులు తీర్చుకుని సమీపంలోని గింజుపల్లి వద్ద కృష్ణానదిలో తన స్నేహితులతో కలసి ఈతకొట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. అచ్చంపేట సీఐ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
క్రోసూరు: మండలంలోని విప్పర్ల, ఊటుకూరు గ్రామాల ప్రధాన రహదారిపై ఒంటిపై తీవ్ర గాయాలపై వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెంది ఉండడం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు, క్రోసూరు ఎస్‌ఐ పి.రవిబాబులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు జరిపారు. మృతుడు క్రోసూరు మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన కుంభా సాంబశివరావు(35)గా గుర్తించారు. తన ద్విచక్రవాహనం పక్కన ఒంటిపై తీవ్ర గాయాలతో చొక్కా లేకుండా పడి ఉండటాన్ని గమనించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. క్లూస్‌టీం, డ్వాగ్ స్క్వాడ్‌ను తెప్పించారు. కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరుకు చెందిన వాడు. క్రోసూరు మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన అనంతమ్మను వివాహం చేసుకుని సుమారు 10 సంవత్సరాల నుంచి అనంతవరంలోనే ఉంటున్నట్లు తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు.

గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం