
దుగ్గిరాలలో 58.6 మి.మీ. వర్షపాతం
– సగటున 25.3 మి.మీ. వర్షపాతం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 58.6 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా పొన్నూరు మండలంలో 8.6 మి.మీ. పడింది. సగటున 25.3 మి.మీ.గా నమోదైంది. మే నెల 24వ తేదీ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 48.2 మి.మీ. కాగా.. ఇప్పటి వరకు 166.8 మి.మీ. పడింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. చేబ్రోలు మండలంలో 52.2, తుళ్ళూరు 40.6, మేడికొండూరు 38.4, ప్రత్తిపాడు 35.2, కాకుమాను 30.2, కొల్లిపర 27.4, తాడికొండ 26.8, మంగళగిరి 23.6, తాడేపల్లి 21.6, ఫిరంగిపురం 19.8, వట్టిచెరుకూరు 19, పెదకాకాని 17.2, గుంటూరు తూర్పు 14.2, గుంటూరు పశ్చిమ 12.2, తెనాలి మండలంలో 9.8 మి.మీ. చొప్పున వర్షపాతం పడింది.
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
నరసరావుపేటటౌన్: గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ శ్రీనివాసరావు నాయక్ శనివారం తెలిపారు. నరసరావుపేట రైల్వేస్టేషన్ వద్ద కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలు క్రింద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించామన్నారు. మృతుడు పింక్ కలర్ చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు నరసరావుపేట రైల్వే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని రైల్వే ఎస్‌ఐ కోరారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
నాదెండ్ల: కారు, బైకు ఢీకొన్న ఘటనలో యువకుడు దుర్మరణం పాలైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్సై జి. పుల్లారావు తెలిపిన వివరాల మేరకు... గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై గొరిజవోలు గ్రామ పరిధిలోని నుదురుపాడు పైవంతెన వద్ద ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన తరిమెళ్ళ బోయేసు (30) తన ద్విచక్రవాహనంపై గుంటూరు నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్నాడు. నుదురుపాడు పైవంతెన సమీపంలో బైకు, కారు ఢీకొన్నాయి. బోయేసు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దుగ్గిరాలలో 58.6 మి.మీ. వర్షపాతం

దుగ్గిరాలలో 58.6 మి.మీ. వర్షపాతం