
ఇంజినీరింగ్ విద్యార్థిపై దాడి అమానుషం
పర్చూరు(చినగంజాం): తిరుపతి జిల్లాలో అనుపల్లి జేమ్స్ అనే విద్యార్థిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి బిల్లాలి డేవిడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జేమ్స్‌ను దళితుడని ఇబ్బందులకు గురిచేసిన యశ్వంత్ నాయుడుతోపాటు అతనిపై దాడికి పాల్పడిన రౌడీషీటర్ రూపేష్, చోటా బ్లేడ్, జగ్గా కిరణ్‌లను కఠినంగా శిక్షించాలని కోరారు. తిరుపతి విద్యానికేతన్ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్న జేమ్స్‌ను అతని కంటే ఒక సంవత్సరం జూనియర్ అయిన యశ్వంత్ నాయుడు హేళన చేశాడన్నారు. దళితుడని, ఒరేయ్ అంబేడ్కర్ అని రకరకాలుగా మాటలతో హింసిస్తుండగా, జేమ్స్ ఖండించాడని తెలిపారు. మరొక సారి ఇదే విధంగా మాట్లాడితే ఊరుకోబోనని హెచ్చరించాడన్నారు. దీనినిపై పగ పెంచుకున్న యశ్వంత్ నాయుడు అతనిపై దాడి చేసి హింసించి నానా విధాలుగా పరుష పదజాలంతో తిట్టడంతో పాటు, కాళ్ళు చేతులు కట్టి వేసి కత్తితో హత్యాయత్నం చేశారని.. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తనపై దాడి చేసిన వారిపై కేసు పెట్టేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళితే తీసుకోకుండా మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయ త్నించారని, రక్షణ కల్పించాల్సిన పోలీసులు వ్యవస్థలను పాడు చేస్తుంటే ప్రభుత్వం ఏమీ చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లిం మైనార్టీల కోసం పనిచేసే నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఇటువంటి వ్యక్తుల భరతం పడతారని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం, కిడ్నాప్, పరువు నష్టం కేసుల సెక్షన్‌లు అమలు చేస్తూ కేసు నమోదు చేసి జేమ్స్‌కు న్యాయం జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి బిల్లాలి డేవిడ్