
కల్యాణోత్సవాలకు వేళాయె
గురజాల: పల్నాడు యాదాద్రిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవాలకు సర్వం సిద్ధమైంది. కోరిన కోర్కేలు తీర్చే కలియుగ దైవంగా పల్నాటి వాసుల ఆరాధ్య దైవంగా పేరుగాంచిన యాదాద్రి ఉత్సవాలు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
‘అంకురార్పణ’తో ప్రారంభం
పల్నాడు యాదాద్రి శ్రీ భూ సమేత నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు శుక్రవారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమై నరసింహ యాగం, ధ్వజారోహణం, తీర్థ ప్రసాద ఘోష్టి, రెండవ రోజు శనివారం కనులపండువగా కల్యాణోత్సవం, అన్న సంతర్పణ, కోలాటం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సహస్ర దీపాలంకరణ సేవ, మూడవ రోజు ఆదివారం నరసింహ యాగం, పూర్ణాహుతి, చక్రస్నానం, ద్వాదశ ప్రదక్షిణాలు, తీర్థ ప్రసాద ఘోష్టి, కాగడ సేవలతో విద్యుత్ దీపాలంకరణతో గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది.
పలు అభివృద్ధి పనులు
దేవాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మాణం చేసిన వాహనశాల, ఆఫీసు రూం, ప్రతి శనివారం అన్నదానం నిర్వహించేందుకు అన్నదాన హాల్‌తో పాటు పలు భవనాల ప్రారంభో త్సవానికి ఏర్పాట్లు చేశారు. కల్యాణోత్సవాలకు దేవాలయాన్ని దేవదాయ కమిటీ సభ్యులు ముస్తాబు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పలు చర్యలు చేపడుతున్నారు.
నేటి నుంచి పల్నాటి యాదాద్రి ఉత్సవాలు మూడురోజుల పాటు ఉత్సవాలకు సర్వం సిద్ధం