
ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి
● పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు ● సత్తెనపల్లిలో నియోజకవర్గ సమీక్ష సమావేశం
సత్తెనపల్లి: ప్రజా సమస్యల పరిష్కారంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని కాకతీయ కల్యాణ మండపంలో సత్తెనపల్లి నియోజకవర్గ సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు మాట్లాడుతూ ప్రతి శాఖలోనూ లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ లక్ష్యాలను అధిగమించేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా వేసవిని దృష్టిలో పెట్టుకొని నీటి ఎద్దడి ఉత్పన్నం కాకుండా ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను సిద్ధం చేసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోర్టుకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించి త్వరగా కేటాయించాలని అధికారులను ఆదేశించారు. పట్టణంతో పాటు గ్రామాల్లో విరిగిన, పాడుబడిన విద్యుత్ స్తంభాలను, లోలెవెల్ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే సవరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విత్తనాలు, పనిముట్లు, సబ్సిడీపై వచ్చే అన్నిరకాల పరికరాలను రైతులకు అందుబాటులో ఉంచేలా వ్యవసాయ అధికారులు చూసుకోవాలన్నారు.
‘ఉపాధి’ లక్ష్యం నెరవేరేలా పనిచేయాలి
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ పంచాయతీరాజ్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. దేవదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం లక్ష్యం నెరవేరేలా అధికారులు పనిచేయాలన్నారు. పేదలకు మంజూరైన పక్కా గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. లక్కరాజు గార్లపాడు రోడ్డులో శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం, సత్తెనపల్లి–అమరావతి మార్గంలోని నందిగామ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం శాఖల వారీగా సమీక్ష నిర్వహించి లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఐ.మురళి, డీపీఎం అమలకుమారి నేతృత్వంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల గ్రూపునకు ఆర్గానిక్ సర్టిఫికెట్లు, రైతులకు సీఎండీఎస్ కిట్లు పంపిణీ చేశారు. జేసీ గనోరే సూరజ్‌ఽ ధనుంజయ్, ఆర్డీఓ జీవీ రమణాకాంతరెడ్డి, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.