నరసరావుపేట: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని మెరుగైన విధి నిర్వహణను కనబర్చాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజుల పాటు పలు పోలీసుస్టేషన్ల నుంచి హాజరైన 55మందికి నూతన చట్టాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కానిస్టేబుళ్లలో పలువురు ఉన్నత విద్యతో పాటు ఎన్నో నైపుణ్యాలు కలిగిన వారు ఉన్నారని తెలిపారు. వాటిని వెలికితీసి, మెరుగులు దిద్ది స్టేషన్‌లో అన్ని విధులు నిర్వర్తించేలా తర్ఫీదు ఇవ్వడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని చెప్పారు. పనులను అందరూ పంచుకోవడం వల్ల ఒత్తిడి, భారం తగ్గుతుందని తెలిపారు. అప్పుడు చేసే పని చాలా సులువుగా మారి, పని చేయాలన్న ఉత్సాహం పెరుగుతుందని పేర్కొన్నారు. స్టేషన్‌లో ఫిర్యాదు రాసే దగ్గర నుంచి రఫ్ స్కెచ్, ఆధారాల సేకరణ, సాక్షుల వాంగ్మూలాలు రాయడం, చార్జిషీటు తయారు చేయడం, అరెస్టు కార్డు రాయడం వంటి అన్ని పనులను అందరూ నేర్చుకోవాలని ఆయన సూచించారు. దీనివల్ల కేసుల్లో దర్యాప్తు త్వరగా పూర్తిచేసి నేరస్తులకు తగిన శిక్షలు వేయించడానికి వీలవుతుందని వివరించారు. తద్వారా బాధితులకు సకాలంలో న్యాయం చేసిన వారమవుతామని ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ సీఐ బి.రమేష్‌బాబు పర్యవేక్షణలో నిర్వహించిన శిక్షణకు ట్రాఫిక్ సీఐ లోకనాథం, డీసీఆర్‌బీ సీఐ ఎం.శ్రీనివాసరావు, మహిళా పోలీసుస్టేషన్ సీఐ కేవీ సుభాషిణి, డీఎస్‌బీ ఎస్‌ఐ ఏ. శశికుమార్, డీసీఆర్‌బీ మహిళా ఎస్‌ఐ జి.అరుణజ్యోతి హాజరై శిక్షణ ఇచ్చారు.
శిక్షణలో పోలీసు సిబ్బందికి
సూచించిన జిల్లా ఎస్పీ