ఇద్దరి ప్రాణాలను బలిగొన్న మృత్యుశకటం | - | Sakshi
Sakshi News home page

ఇద్దరి ప్రాణాలను బలిగొన్న మృత్యుశకటం

Oct 14 2023 2:00 AM | Updated on Oct 14 2023 11:15 AM

- - Sakshi

పిడుగురాళ్లరూరల్‌: వేగంగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు ఢీకొనగా ఇద్దరు మృతి చెందగా, ఒకరు గాయపడిన సంఘటన పిడుగురాళ్ల మండలంలోని బ్రాహ్మణపల్లి బైపాస్‌పై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...న్యూ వెల్లంపల్లి గ్రామానికి చెందిన పోతురాజు వెంకటేశ్వర్లు ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తాడు. వెంకటేశ్వర్లు, భార్య రమాదేవిలకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె లక్ష్మీ తేజస్విని(6), చిన్న కుమార్తె హర్షిత. హర్షితకు డెంగీ జ్వరం రావడంతో తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని వెంకటేశ్వర్లు న్యూ వెల్లంపల్లి నుంచి బ్రాహ్మణపల్లికి ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి వెళ్తున్నాడు.

ఈ సమయంలోనే అదేగ్రామానికి చెందిన కారుకుళ్ల సంపూర్ణ(49) పొలం పనుల నిమిత్తం బ్రాహ్మణపల్లి మెడికల్‌ కాలేజీ వైపు వెళ్తుంది. బ్రాహ్మణపల్లి వైపు వెళ్తున్న తమ్ముడు వరుసయ్యే వెంకటేశ్వర్లును బండి ఎక్కించుకొమని అడగ్గా వెంకటేశ్వర్లు ఎక్కించుకొన్నాడు. బ్రాహ్మణపల్లి ఎక్స్‌ రోడ్డు దగ్గరకు రాగానే గుంటూరు నుంచి దాచేపల్లి వైపు వేగంగా వెళ్తున్న లారీ వెనుక వైపు నుంచి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో సంపూర్ణ, పోతురాజు లక్ష్మీతేజస్విని అక్కడికక్కడే మృతిచెందారు.

బైక్‌ నడుపుతున్న వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలు కావటంతో నరసరావుపేట ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. బండి మీద ఉన్న పాప హర్షితకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటనలో మృతిచెందిన సంపూర్ణకు భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పట్టణ సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ రబ్బానీ ఖాన్‌ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

లారీ డ్రైవర్‌ అతివేగం.. ద్విచక్ర వాహన చోదకుడి నిర్లక్ష్యం ముక్కుపచ్చలారని తన కుమార్తె ఉసురుతీయగా.. మధ్యలో లిఫ్ట్‌ అడిగిన మహిళ ప్రాణాలు సైతం గాల్లో కలిసిపోయాయి. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి బైపాస్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద జరిగిన ఈ హృదయవిదారక ఘటన చూపరులను కలచివేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి అచేతనంగా పడి ఉండడం స్థానికులచే కంటతడి పెట్టించింది. ఘటనలో తండ్రి సైతం తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement