
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరుల సంస్మరణ దినం అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళి పోలీసు అమరవీరుల కుటుంబసభ్యులకు సన్మానం
నరసరావుపేటరూరల్: సమాజ హితం కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీసు మహావీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. లింగంగుంట్లలోని పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో అమరవీరుల సంస్మరణ దినంను మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావులు పాల్గొని విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళి అర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజానికి పోలీసులు చేసే సేవ వెలకట్టలేనిదని తెలిపారు. పోలీసు వ్యవస్థ లేని సమాజాన్ని ఊహించలేదమన్నారు. పోలీసు వ్యవస్థ లేకపోతే సమాజంలో సంఘవిద్రోహ శక్తుల ఆగడాలకు అడ్డు ఉండదని అన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు, దేశంలో పోలీసులు నిత్యం పహారా కాస్తూ ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 26 మంది పోలీసులు వీర మరణం పొందారని గుర్తుచేశారు. ఇందులో పల్నాడు జిల్లాకు చెందిన ఆరుగురు సిబ్బంది ఉన్నారని వీరందరికి శ్రద్దాంజలి ఘటిస్తున్నట్టు తెలిపారు. అనంతరం జిల్లాలో వీరమరణం పొందిన ఎస్‌ఐ, ఎనిమిది మంది సిబ్బంది కుటుంబసభ్యులను సన్మానించారు. జిల్లా ఏఆర్ డీఎస్పీ జి.మహాత్మాగాంధీ పర్యవేక్షణలో ఆడ్మిన్ ఆర్‌ఐ ఎం.రాజా పరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, అదనపు ఎస్పీ(క్రైమ్) సీహెచ్ లక్ష్మీపతి, ఏఆర్ అడిషనల్ ఎస్పీ వి.సత్తిరాజు, డీఎస్పీలు ఎం.హనుమంతరావు, ఎం.వెంకటరమణ, పోలీసు అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ టి.మాణిక్యాలరావులు పాల్గొన్నారు.

పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి