
కాటికాపరి హత్య కేసులో దర్యాప్తు తప్పుదోవ
ఎమ్మెల్యే జోక్యమే దీనికి కారణం అరవింద బాబుపై పరువు నష్టం దావా పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి మీడియాతో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి
నరసరావుపేట: కాటికాపరి గాడిపర్తి ఎఫ్రాన్ హత్యకేసులో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పోలీసుల దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తనపైన, వైఎస్సార్‌సీపీ వారిపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తనపైన చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. పోలీసులు ఈ హత్య కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల దర్యాప్తు పూర్తి కాకుండానే ఎమ్మెల్యే ఇప్పటికే మూడుసార్లు ప్రెస్‌మీట్ పెట్టి మరీ హత్య చేసింది వైఎస్సార్‌సీపీ వారని, వారిని ప్రోత్సహించానని తన పేరు చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. క్రిస్టియన్ పాలెం నుంచి స్వర్గపురి–2 వరకు సుమారు 150 సీసీ కెమెరాలు ఉన్నాయని, వాటి ఫుటేజీలు పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. లీగల్ నోటీసులు ఇచ్చి, పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. ఖాదర్ అనే వ్యక్తిని ఎలాగైనా ఈ కేసును ఇరికించాలని ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. నరసరావుపేటలో ఏది జరిగినా తమ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు జరిగిన వెన్న బాలకోటిరెడ్డి హత్య గురించి కూడా అరవిందబాబు మాట్లాడారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున కేసు రీ ఓపెన్ చేసి సీబీసీఐడీ దర్యాప్తు చేయించాలని సవాల్ విసిరారు.
ఇదిగో అవినీతి చిట్టా
ఇటీవల ఎమ్మెల్యే స్టేడియంలో అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కోటప్పకొండ నుంచి మట్టి తీసుకెళ్లే ఒక్కొక్క లారీకి రూ.800 చొప్పున తీసుకుంటున్నాడని, ఏఎంఆర్ దగ్గర రూ.2 వేలు తీసుకొని టోకెన్ ఇస్తున్నాడని, దీంట్లో రూ.1200 ప్రభుత్వానికి, రూ.800 అరవింద బాబుకు వెళతాయని డాక్టర్ గోపిరెడ్డి ఆరోపించారు. భవన నిర్మాణాలకు కూడా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని తెలిపారు. సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో కూడా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని వార్తలు వచ్చాయన్నారు. కోటప్పకొండ ఇనాం భూముల్లోనే మట్టి తవ్వుకుంటున్నారని చెప్పారు. స్విమ్మింగ్ ఫూల్ అందుబాటులోకి తీసుకు రాలేకపోయారన్నారు. అవిశ్వాయపాలెం – కోటప్పకొండ రోడ్డుకు డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిధులు ఇచ్చి ఏడాది గడిస్తే ఇప్పటికీ రోడ్డు వేసిన పాపాన పోలేదని అన్నారు.