
ఆయిల్ మిల్లులపై దాడులు
నమూనాలు సేకరించిన
ఫుడ్ సేఫ్టీ అధికారులు
నరసరావుపేట టౌన్: నూనె తయారీ కేంద్రాలపై మంగళవారం ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నకిలీ నువ్వుల నూనెల విక్రయాల వ్యవహారంపై ప్రజారోగ్యంపై కల్తీ కత్తి పేరిట సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించి దాడులు నిర్వహించారు. పల్నాడు జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పలు నూనె తయారీ కేంద్రాలను తనిఖీ చేశారు. అనుమానం కలిగిన రెండు తయారీ కేంద్రాల్లో నూనె శాంపిళ్లను సేకరించారు. ల్యాబ్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.
నరసరావుపేట: కార్తికమాసం పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్ధం పంచరామాలు, మహానంది, యాగంటి, శ్రీశైలం, ఇతర ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక యాత్ర బస్సు సర్వీసులు ఏర్పాటుచేశామని ప్రజారవాణా జిల్లా అధికారి, ఆర్టీసీ ఆర్‌ఎం అజితకుమారి పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని ఆరు డిపోల నుంచి ఎక్స్‌ప్రెస్, అల్ట్రాడీలక్స్, సూపర్ లగ్జరీ తరగతుల్లో ప్రత్యేక సదుపాయాలతో నడుపుతున్నామన్నారు. శుభ్రమైన సీటింగ్ సౌకర్యం, ఆన్‌లైన్ రిజర్వేషన్, సురక్షిత ప్రయాణ వాతావరణం కల్పించబడుతుందన్నారు. ప్రతి ఆదివారం సాయంత్రం అన్నీ డిపోల నుంచి బస్సుల సౌకర్యం ఉంటుందన్నారు. భక్తులు సమీప బస్‌స్టేషన్ల ద్వారా రిజర్వేషన్లు పొందవచ్చన్నారు. కార్తిక పౌర్ణమి రోజున అరుణాచలం క్షేత్ర దర్శనికి కాణిపాకం, అలివేలు మంగాపురం, శ్రీకాళహస్తి, శ్రీనగర్ గోల్డెన్‌టెంపుల్, శబరి మల యాత్రికులకు అందుబాటు ధరల్లో ప్రత్యేక అద్దె ప్రాతిపదినక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
విజయపురిసౌత్ : నాగార్జునసాగర్‌లో నూతన ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు మాచర్ల మండలం నాగులవరం, పసువేముల గ్రామాల పరిధిలో ప్రతిపాదించిన భూములను ఎయిర్ పోర్ట్ ప్లానర్స్ అండ్ డిజైన్ కన్సల్టింగ్ ప్రైవేటు లిమిటెడ్ సీఈఓ విక్రమ్‌కుమార్ మంగళవారం పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్ స్థలం వద్ద సాంకేతిక లక్షణాలు, గాలి దిశలు, ప్రతిపాదిత భూమి స్వభావం, భూగర్భ జలాల స్థితి, విద్యుత్ సరఫరా, రోడ్ల దూరం, హైవే దూరం పరిశీలించారు. కార్యక్రమంలో మాచర్ల తహసీల్దార్ కిరణ్‌కుమార్, సర్వేయర్‌లు కేవై రాజు, కసిన్యా నాయక్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.
విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 587.80 అడుగులకు చేరింది. ఇది 305.9818 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 9,800, ఎడమకాలువకు 8,718, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 32,561, ఎస్‌ఎల్‌బీసీకి 1,200, వరదకాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 52,579 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 52,579క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
పెదకాకాని: పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయం అమావాస్య మంగళవారం సందర్భంగా రాహు కేతువులకు పూజలు జరిపించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు సమయాల్లో పూజలు నిర్వహించారు. ఈ పూజలకు 627 టికెట్లు భక్తులకు విక్రయించినట్లు ఆలయ ఉపకమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. రాహుకేతు పూజల ద్వారా ఒక్క రోజులో స్వామివారికి రూ. 3,13,500 ఆదాయం సమకూరిందన్నారు. భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.