
‘వైద్య సేవ’ ఆసుపత్రులకు రూ.650 కోట్లు చెల్లించాలి
మిగతా రూ.2వేల కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో తేదీలు ప్రకటించాలి వైద్యసేవల ప్యాకేజీ రేట్లు పెంచాలి లేదంటే గురువారం రాష్ట్రవ్యాప్త ధర్నాలు ప్రభుత్వానికి ఆశా ప్రతినిధుల హెచ్చరిక నరసరావుపేట భారీ ర్యాలీ
నరసరావుపేట: రాష్ట్రంలోని ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ హాస్పిటళ్లకు ఇవ్వాల్సిన బకాయిల్లో మొదటివిడతగా రూ.650 కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) జిల్లా కన్వీనర్ డాక్టర్ నాగోతు ప్రకాష్ డిమాండ్ చేశారు. బకాయిలు తక్షణమే చెల్లించాలంటూ నరసరావుపేటలోని ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ హాస్పిటళ్ల డాక్టర్లు, సిబ్బంది మంగళవారం ప్లకార్డులు చేతబూని ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆశ ప్రతినిధులతో కలిసి నాగోతు ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలు రూ.2,500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 93 శాతం మంది వైద్య కార్డులు ఉండటంతో నగదు చెల్లించి వైద్యసేవలు పొందేవారు చాలా తక్కువగా ఉన్నారన్నారు. ప్రభుత్వం నుంచి బకాయిలు అందక, డబ్బులు చెల్లించి వైద్యసేవలు పొందేవారు లేక హాస్పిటళ్ల నిర్వహణ చాలా కష్టంగా మారిందన్నారు. దీంతోపాటు సేవలు పొందే జబ్బులను పెంచారన్నారు. ఆ జబ్బులకు అందజేసే వైద్యసేవలకు ప్రభుత్వం చెల్లించే ప్యాకేజీ రేట్లు కూడా నేటి ధరలకు అనుగుణంగా లేవన్నారు. సిజేరియన్‌కు రూ.13 వేల నుంచి రూ.9 వేలు మాత్రమే హాస్పిటళ్లకు చెల్లిస్తున్నారని, ఈ విధమైన ప్యాకేజీలు గిట్టుబాటు కావట్లేదన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ స్కీం తీసుకొస్తామని చెబుతోందని, అయితే ప్యాకేజీలపై నెట్‌వర్క్ హాస్పిటళ్ల అసోసియేషన్‌ను ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదించకపోవటం శోచనీయమన్నారు. హాస్పిటళ్లకు బకాయిలు చెల్లించేందుకు నిర్దిష్ట తేదీలు ప్రకటించి.. దానికి అనుగుణంగా చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే గురువారం రాష్ట్రస్థాయిలో నెట్‌వర్క్ హాస్పిటళ్ల ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని హెచ్చరించారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రతినిధి డాక్టర్ అమర్ మాట్లాడుతూ.. ఆరోగ్యశాఖ మంత్రి అసెంబ్లీలో చెప్పిన విధంగా రూ.650 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మిగతా రూ.2 వేల కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో కూడా ప్రభుత్వం తెలపాలని కోరారు. డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ మాట్లాడుతూ.. 2007 నుంచి ప్రారంభమైన ఆరోగ్యశ్రీలో ఇప్పటివరకు నెట్‌వర్క్ హాస్పిటళ్లకు ఇచ్చే ప్యాకేజీ రేట్లలో పెద్దగా మార్పులేమీ జరగలేదని, హెల్త్ కేర్ ఎక్విప్‌మెంట్ల ధరలు 90 శాతం పెరిగినా ప్యాకేజీలు 10శాతం కూడా పెరగలేదన్నారు. నెట్‌వర్క్ హాస్పిటళ్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల్లో వెంటనే 30 శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఐఎంఏ కార్యదర్శి పాలూరి శ్రీనివాసరెడ్డి, ప్రతినిధులు కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వరబాబు, వంశీ, నాగిరెడ్డి, బాజిబాబు, అనిరుద్దీన్, హర్ష, రామకృష్ణ, జి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.