తీరానికి కార్తిక శోభ | - | Sakshi
Sakshi News home page

తీరానికి కార్తిక శోభ

Oct 22 2025 7:10 AM | Updated on Oct 22 2025 7:10 AM

తీరానికి కార్తిక శోభ

తీరానికి కార్తిక శోభ

తీరానికి కార్తిక శోభ ● విలువైన బంగారు ఆభరణాలతో తీరానికి రాకూడదు. ● చిన్నపిల్లలు, వృద్ధులను తీరానికి తీసురాకూడదు. ● తీరంలో స్నానాలాచరించే ముందు విలువైన వస్తువులు, దుస్తులు నమ్మకమైన వ్యక్తులకు మాత్రమే అప్పగించాలి. ● తీరంలో నీరు నడుము లోతుకు మించి ఉంటే లోపలకు వెళ్లరాదు. ● కొత్త వ్యక్తుల మాటల నమ్మి వారి వెంట ఎక్కడికీ వెళ్లకూడదు. ● అపరిచిత వ్యక్తులకు పిల్లల్ని అప్పగించరాదు.

నేటి నుంచి ప్రారంభం కానున్న కార్తిక మాసం ఆహ్లాదకరంగా సూర్యలంక సముద్రతీరం సందర్శనకు రానున్న పర్యాటకులు, భక్తులు

స్నేహపూర్వక వాతావరణం ముఖ్యం

బాపట్ల టౌన్‌: సముద్రస్నానం అనగానే టక్కున గుర్తుకొచ్చేది సూర్యలంక తీరం. కార్తిక మాసంలో ఈ తీరానికి చేరుకొని సూర్య నమస్కారాలతో కూడిన స్నానాలు చేసేందుకు భక్తులు, పర్యాటకులు పోటీపడుతుంటారు. బుధవారం నుంచి కార్తిక మాసం ప్రారంభం కావడంతో తీరం ముస్తాబైంది. సహజ సిద్ధమైన తీరంగా పేరున్న సూర్యలంకలో స్నానాలు చేసేందుకు సముద్రం అనుకూలంగా ఉంటుంది. దీంతో సూదూర ప్రాంతాల నుంచి పూజలు నిర్వహించేందుకు భక్తులు, విహారయాత్ర చేసేందుకు పర్యాటకులు వస్తుంటారు. కార్తిక పౌర్ణమి రోజున సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించి, గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలతో కూడిన గౌరీదేవి పూజలు నిర్వహిస్తే ఆశీస్సులు మెండుగా ఉంటాయనేది భక్తుల నమ్మకం.

పోలీసుల ఆదేశాలు

సుదూర ప్రాంతాల నుంచి సూర్యలంక తీరానికి చేరుకునే పర్యాటకులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసులు సూచించారు. నియమ నిబంధనలను పక్కాగా పాటించాలని పేర్కొన్నారు.

మరికొన్ని సూచనలు ఇవీ..

రవాణా సదుపాయం ఇలా..

బాపట్ల నుంచి 9 కిలోమీటర్ల దూరంలో సూర్యలంక సముద్ర తీరం ఉంది. ముందుగా పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు చేరుకోవాలి. అక్కడి నుంచి ఆటో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. బాపట్ల నుంచి నేరుగా సూర్యలంక వరకు ఆటోలు వెళ్తుంటాయి. ఒక్కో మనిషికి రూ. 30 చార్జీ ఉంటుంది. సర్వీసులు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. కార్తిక మాసంలో ప్రతి శని, ఆది, సోమవారాలలో బాపట్ల నుంచి ఆర్టీసీ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. స్థానిక రైల్వేస్టేషన్‌ నుంచి నేరుగా సూర్యలంకకు, బాపట్ల పాతబస్టాండ్‌ నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చే వారి సౌకర్యార్థం గుంటూరు బస్‌ స్టేషన్‌ నుంచి కూడా నేరుగా సూర్యలంక బస్సులు అందుబాటులో ఉంటాయి.

సకల సౌకర్యాలు

తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సేద తీరేందుకు వీలుగా ఒడ్డున పర్యాటక శాఖ వారి హరిత రిసార్ట్స్‌ ఉన్నాయి. పలు ప్రైవేటు రిసార్ట్స్‌ కూడా పర్యాటకులకు సేవలు అందిస్తున్నాయి. సాధారణ రోజుల్లో రిసార్ట్స్‌లోని ఒక్కో రూమ్‌కు రూ. 2,000 నుంచి రూ.4,500 వరకు ఉంటుంది. శని, ఆదివారాల్లో రూ. 3,500 నుంచి రూ.6000 వరకు తీసుకుంటారు.

బాపట్ల: పర్యాటకులకు స్నేహపూర్వకమైన వాతావరణంలో బీచ్‌లు ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌ కుమార్‌ తెలిపారు. పర్యాటకులను ఆకర్షించే అంశంపై సంబంధిత శాఖల అధికారులతో వీసీ ద్వారా మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి ఆయన మాట్లాడారు. పర్యాటక రంగానికి జిల్లా చాలా కీలకం అన్నారు. ఆరు మండలాలలోని తీర ప్రాంతంలో 17 పంచాయతీలలో బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఎనిమిది పంచాయతీల పరిధిలో తొమ్మిది బీచ్‌లలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధించాలని ఆదేశించారు. ఆదాయ వనరులు పెరగడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించాలని ఆదేశించారు. కార్యక్రమాలు రిసార్డ్స్‌ వెలుపల నిర్వహిస్తే నామమాత్రపు రుసుము విధానం ప్రవేశపెట్టాలన్నారు. దుకాణాలకు, వాహనాల పార్కింగ్‌కు ధరలు నిర్ణయిస్తూ పంచాయతీలలో తీర్మానం చేయాలని సూచించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు మెరుగు పరచాలన్నారు. ప్రతివారం బీచ్‌లను సందర్శిస్తామన్నారు. బాధ్యతలు నిర్వర్తించకుంటే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో డీపీవో ప్రభాకర్‌ రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement