నరసరావుపేట ఈస్ట్: వైఎస్సార్ కడప జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాలలో నాలుగు, ఐదు తరగతులలో ప్రవేశాలకు జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు పల్నాడు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సీఈఓ ఎస్.పల్లవి, చీఫ్ కోచ్ పి.అఫ్రోజ్‌ఖాన్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీ వరకు జరిగే మండలస్థాయి పోటీలలో ఎంపికై న అభ్యర్థులకు ఈనెల 23, 24తేదీల్లో జిల్లాస్థాయి ఎంపికలు సతైనపల్లిరోడ్డులోని డీఎస్‌ఏ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో ఎంపికై న అభ్యర్థులను ఈనెల 29, 30తేదీల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణంలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపనున్నట్టు వివరించారు. నాలుగవ తరగతి ప్రవేశం కోరే అభ్యర్థులు 2014 ఆగస్ట్ 1వ తేదీ నుంచి 2015 జులై 31వ తేదీలోపు జన్మించి 3వ తరగతి పూర్తిచేసి ఉండాలన్నారు. ఐదో తరగతికి 2013 ఆగస్ట్ 1వ తేదీ నుంచి 2014 జులై 31వ తేదీలోగా జన్మించి ఉండాలని తెలిపారు. అభ్యర్థులు తమ జనన ధ్రువీకరణ పత్రం, విద్య, కుల, ఆదాయ, ఆధార్ పత్రాలతోపాటు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో హాజరు కావాలని కోరారు.
బల్లికురవ ఎంఈఓ సస్పెన్షన్
బల్లికురవ: ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేస్తూ ప్రతి పనికి సొమ్ము డిమాండ్ చేస్తున్న బల్లికురవ ఎంఈఓ బీ.వీరరాఘవయ్యపై పాఠశాల విద్య గుంటూరు ఆర్జేడీ సుబ్బారావు సోమవారం సస్పెన్షన్ వేటు విధించారు. అక్రమ డిప్యూటేషన్‌లు, తుఫాన్‌ల పేరిట వసూళ్లు ఉపాధ్యాయుల ఎల్‌ఐసీ ప్రీమియంలు కార్యాలయానికి పంపడంలో జాప్యం, ఉపాధ్యాయులు శిక్షణ సొమ్ము స్వాహా, కార్యాలయ ఖర్చుల పేరిట వసూళ్లు, విశ్రాంత ఉపాధ్యాయుల పెన్షన్ చెల్లింపులో చేతివాటం ప్రదర్శించారని యూటీఎఫ్ నేతలు జిల్లా కలెక్టర్, ఆర్జేడీ, డీఈవోలకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై గత నెల 20వ తేదీ స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో ఆర్జేడీ విచారణ చేపట్టారు. విచారణలో పలువురు ఉపాధ్యాయులు విశ్రాంత ఉపాధ్యాయులు వీరరాఘవయ్య అవినీతిపై లిఖితపూర్వకంగా వివరించారు. విచారణ అనంతరం ఆర్జేడీ సస్పెన్షన్ వేటు వేశారు.


