రాష్ట్రపతి, ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి, ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటన

Jun 3 2026 12:45 AM | Updated on Jun 3 2026 12:45 AM

రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

భువనేశ్వర్‌: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి విచ్చేయనున్నారు. రైరంగ్‌పూర్‌ను సందర్శించనున్నారు. మయూర్‌భంజ్‌ లోక్‌ సభ సభ్యుడు నొబొ చరణ్‌ మాఝీ ఈ విషయం తెలిపారు. రాష్ట్రపతి ఈ నెల 19, 20 తేదీలలో రెండు రోజులు రాష్ట్ర పర్యటనలో పాల్గొంటారు. ప్రధాన మంత్రి ఈ నెల 20వ తేదీన పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి మెట్టినింటి గ్రామం పహడ్‌పూర్‌, రాయిరంగ్‌పూర్‌లో శంకు స్థాపన చేసి పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. కుసుమ మండలం సులిదుమాలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

భువనేశ్వర్‌ హై టెక్‌ మెడికల్‌ కాలేజీ కొత్త డైరెక్టర్‌గా సీతారాం

భువనేశ్వర్‌: సీనియర్‌ వైద్యుడు మరియు పాథాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ సీతారాం మహా పాత్రో భువనేశ్వర్‌ హై టెక్‌ వైద్య బోధన ఆస్పత్రి డైరెక్టర్‌ అడ్మినిస్ట్రేషన్‌ మరియు మెడికల్‌ సూపరింటెండెంట్‌గా నియమితులు అయ్యారు. డాక్టర్‌ సీతారాం మహా పాత్రోకు వైద్య, పరిపాలనా రంగాలలో అనేక సంవత్సరాల నైపుణ్యం, అనుభవం ఉంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ముఖ్యమైన పదవులలో అంకిత భావంతో పని చేశారు. ప్రస్తుతం జాజ్‌పూర్‌ మహా రాజా యయాతి కేశరి వైద్య బోధన ఆస్పత్రి డీన్‌, చైర్మన్‌గా పని చేస్తున్న డాక్టర్‌ సీతారాం మహా పాత్రో ప్రఖ్యాత వైద్యుడిగా, నిర్వాహకుడిగా పేరు పొందారు.

టెన్త్‌ విద్యార్థులకు వేసవి విద్యా శిబిరాలు

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ ప్రధమేశ్‌ ఆదేశాల మేరకు పదో తరగతి విద్యార్థుల కోసం 20 రోజుల పాటు వేసవి విద్యా శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి శిబిరాలు ఆరంభమయ్యాయి. ప్రతి పాఠశాలలో ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. స్మార్ట్‌ క్లాస్‌ల ద్వారా అంశాల వారీగా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేస్తారు. అలాగే ఆదివారం రోజున కెరీర్‌ కౌన్సెలింగ్‌ కార్యక్రమం నిర్వహించడంతోపాటు ఈ నెల 20వ తేదీన తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని విద్యాశాఖాధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు విద్యాశాఖ అధికారి మాంజులాతా బోయి, భగీరధి బెహరా పాల్గొన్నారు.

పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఆదివాసీ ప్రజల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రాజెక్టును అమలు చేస్తుంది. మంగళవారం నువాగడ బ్లాక్‌ నుంచి సెరంగో (గుమ్మా బ్లాక్‌) వరకు సుమారు 16 కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు బరంపురం ఎంపీ ప్రదీప్‌ కుమార్‌ పాణిగ్రాహి నువాగడ బ్లాక్‌ వద్ద శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణానికి రూ.40.21 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. దీంతో గుమ్మా బ్లాక్‌ సెరంగో ప్రజలు పర్లాకిమిడి వచ్చి నువాగడ వెళ్లకుండా నేరుగా సెరంగో గ్రామం నుంచి నువాగడ బ్లాక్‌కు చేరుకోవచ్చు. ఈ కార్యక్రమానికి మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, ఎస్‌డీసీ చైర్మన్‌ కామ్‌దేవ్‌ బోడోనాయక్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నబకిశోరో శోబోరో, రోడ్లు–భవనాల శాఖ సూపరింటెండింట్‌ ఇంజినీర్‌ అభిషేక్‌ శెఠి, తదతరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement