భువనేశ్వర్: ఖుర్దారోడ్ రైల్వే మండలం రైల్వే అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ వాటాదారులకు పలు ఆకర్షణీయమైన లాభసాటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు డైరెక్టర్ జగ్మోహన్ ఖుంటియా తెలిపారు. రుణాలపై వడ్డీ 1 శాతం తగ్గింపు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ 6 శాతం నుంచి 8.5 శాతానికి పెంపుదల, పొదుపు సొమ్ముపై వడ్డీని 5 శాతం నుంచి 7.5 శాతానికి పెంచడంతో అయోధ్య, తిరుపతి వంటి ప్రముఖ పర్యాటక, పుణ్య క్షేత్రాల్లో సులభ ధరలకు సౌకర్యవంతమైన వసతితో కూడిన విహార విడిది గృహాల సౌకర్యం, హైదరాబాద్‌లోని యశోద, బొంబాయిలోని టాటా మెమోరియల్‌లో రోగుల సహాయకులకు రోజుకు రూ.100 చొప్పున వసతి సదుపాయాలు ప్రముఖమైనవిగా పేర్కొన్నారు. త్వరలో రుణ పరిమితి విస్తరణ, గహ రుణాలు, విద్యా రుణాలపై వడ్డీ తగ్గింపు వంటి చర్యల ద్వారా వాటాదారులు ఇకపై విదేశీ బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ముఖ్య అతిథి అన్నారు. బ్యాంకులోని 40 ఖాళీ పోస్టులకు వాటాదారుల పిల్లలకు మెరిట్ ఆధారంగా నియమించేందుకు యోచిస్తున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి ఒకే రోజున ఉత్తీర్ణుల ఫలితాలతో నియామక పత్రాలను పంపిణీ చేసే ప్రతిపాదన పాలక మండలి పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. పదవీ విరమణ చేసిన వాటాదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, హాలిడే హోమ్‌లలో వసతి కల్పించాలని శాఖ కార్యదర్శి లక్ష్మీధర్ మహంతి చేసిన ప్రతిపాదన తదుపరి డైరెక్టర్ల సమావేశంలో చర్చించి ఆమోదిస్తామని హామీ ఇచ్చారు. బ్యాంక్ మేనేజర్ పి. చక్రవర్తి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి తూర్పు కోస్తా రైల్వే శ్రామిక కాంగ్రెస్ మండల సమన్వయకర్త, డైరెక్టర్ నిరంజన్ మిశ్రా తదితరులు హాజరయ్యారు.


