రాయగడ: కొండలు, అడవులు, భాషా అవరోధాలను అధిగమిస్తూ జిల్లా యంత్రాంగం స్వతంత్ర సఘన సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని నియమగిరి కొండల ప్రాంతంలో నివసిస్తున్న ఫకేరి గ్రామంలో నివసిస్తున్న డొంగిరియా తెగకు చెందిన ఆదిమ ఆదివాసీ ప్రాంతంలో చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని 139–బిసంకటక్ అసెంబ్లీ నియోజకవర్గం పరిఽధిలో ఉన్న ఈ గ్రామంలో ఓటరు అవగాహన కల్పించడం, ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని సంబంధత శాఖ అధికారులు విజయవంతంగా నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ నాయకత్వంలో కళ్యాణసింగుపూర్ సమతి బీడీవో మనీషా దాస్, డిప్యూటీ కలెక్టర్ శివప్రసాద్ సాహు, పీఈవో శ్వేతాంబర్ ప్రధాన్ తదితరులు ఫకేరీ గ్రామానికి అత్యంత ప్రయాసపడి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ డొంగిరియా గోండి భాషలో గ్రామస్తులతో మాట్లాడి ఎస్‌ఐఆర్–2026 లక్ష్యాలు, ప్రాధాన్యత, ప్రక్రియ గురించి వివరించారు. జిల్లా యంత్రాంగం ఈ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా గిరిజన సముదాయాలను ప్రజాస్వామ్య ప్రక్రియలో మరింత భాగస్వాములను చేయగలిగింది. ప్రజల మాతృభాషలో అవగాహన కల్పించడం వల్ల ఈ కార్యక్రమం మరింత సులభంగా విజయవంతమవుతుందని అధికారులు పేర్కొన్నారు.


