ఝార్సుగుడలో దోపిడీ ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఝార్సుగుడలో దోపిడీ ముఠా అరెస్టు

May 31 2026 1:00 AM | Updated on May 31 2026 1:00 AM

పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు

రాయగడ: ఝార్సుగుడ జిల్లాలో భారీ భారీ దోపిడీకి సిద్ధమైన ఆయుధదారుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రెంగాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనలో ఒక నిందితుడు గాయపడగా అతడిని ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్ర తెలియజేసిన వివరాల ప్రకారం.. మే 29 రాత్రి రెంగాలి ప్రాంతంలో ఓ ఆర్థిక సంస్థపై దోపిడీకి పాల్పడేందుకు ఆయుధాలతో కూడిన ముఠా సంచరిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా చర్యలు చేపట్టామని వివరించారు. ఈ క్రమంలో కదమ్‌ఘాట్‌ సమీపంలోని మాఘేంటేశ్వరి ఆలయం వద్ద ఆనుమానాస్పదంగా సంచరిస్తున్న పికప్‌ వ్యాన్‌ని పోలీసులు గుర్తించారు. వాహనాన్ని ఆపాలని సంకేతాలు ఇవ్వగా అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వెంబడించి వాహనం వెనుక భాగాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపి అడ్డుకున్నారు. ఈ క్రమంలో జయ్‌ చౌహన్‌ అనే నిందితుడు పోలీసులపై కాల్పులకు దిగినట్లు పోలీసులు గుర్తించారు. పలుమార్లు లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ కాల్పులు కొనసాగించడంతో ఆత్మరక్షణ నిమిత్తం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జయ్‌ చౌహన్‌ కుడి తొడ భాగంలో తుపాకీ గాయం కావడంతో అతడిని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మిగతా నలుగురు నిందితులు చీకటిని ఆసరాగా తీసుకుని సమీప అడవుల్లోకి పారిపొయారు. అనంతరం కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించిన పోలీసులు వారిని కూడా పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో బ్రజరాజ్‌నగర్‌కు చెందిన కరణ్‌ చౌహన్‌, బిశ్వజీత్‌ నాయక్‌, సంతొష్‌ మహాతొ అలియాస్‌ బడే, రొహిత్‌ కుమార్‌ సింగ్‌ అలియాస్‌ రవి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో వీరిలో పలువురికి హత్యాయత్నం, దోపిడీ, చోరీ, బెదిరింపులు, ఆయుధాల చట్ట ఉల్లంఘన వంటి పలు నేర చరిత్రలు ఉన్నట్లు వెల్లడైంది. నిందితుల నుంచి ఒక దేశీయ తయారీ తుపాకీ, రెండు ఖాళీ తూటాలు ఒక భుజాలి (పదునైన ఆయుధం), ఒక నకిలీ తుపాకీ, నిందితులు ఉపయోగించిన పికప్‌ వ్యాన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement