ప్రజల్లో అవగాహనకు చైతన్య ర్యాలీలు
పర్లాకిమిడి: ఒడియా భాషలోనే వాణిజ్య సంస్థలు, బస్సులు, దుకాణాల పేర్లను రాయాలని అధికారులు అన్నారు. అలాగే సైన్ బోర్డులను సైతం ఒడియాలోనే రాయాలని స్పష్టం చేశారు. ఈ విషయమై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా శనివారం చైతన్యం ర్యాలీలు నిర్వహించారు. ఒడియా పక్షోత్సవాల్లో భాగంగా గజపతి జిల్లా యంత్రాంగం, జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నుంచి చైతన్య ర్యాలీని ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగ జెండా ఊపి ప్రారంభించారు. ఒడియా భాషలోనే వాణిజ్య సంస్థలు, ప్రైవేటు బస్సులు, దుకాణాలు నామఫలకాలు, సైన్‌బోర్డులు ఉండాలని అధికారులు అన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో వివిధ ప్రభుత్వ అధికారులు, పోలీసుశాఖతో ఏడీఎం హారా, జిల్లా ముఖ్యశిక్షాధికారి డాక్టర్ మయాధర్ సాహు, జిల్లా సామా జిక సంక్షేమ అధికారిని మనోరమా దేవి, జిల్లా సమాచారశాఖ అధికారి ప్రదీప్త గురుమయి, వివిధ పాఠశాలల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.
ఒడియా భాషలో సైన్‌బోర్డులు పెట్టాలని ర్యాలీ
జయపురం: జయపురం పట్టణంలో కూడా ఒడియాలోనే సంస్థల పేర్లు రాయాలంటూ అవగాహన ర్యాలీ చేపట్టారు. ర్యాలీని జయపురం సమగ్ర గిరిజనాభివృద్ధి పంస్థ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేట్ తృప్తి బరైయ్ ప్రారంభించారు. విద్యార్థులు రంగురంగుల ప్లకార్డులు పట్టుకొని, కరపత్రాలు ప్రజలకు, వ్యాపారులకు పంచుతూ ఒడియా భాషలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఒడియా భాష పక్ష కార్యక్రమంలో భాగంగా జయపురం తెలుగు సాంస్కృతిక సమితి వారి జయపురం సిటీ ఉన్నత పాఠశాల తరఫున 50 మందికి పైగా విద్యార్థులు పాఠశాల ప్రాంగణం నుంచి ర్యాలీ నిర్వహించారు. జిల్లా లేబర్ కార్యాలయం వద్ద అధికారులు ప్రారంభించిన ర్యాలీ, అలాగే సిటీ స్కూలు విద్యార్థుల ర్యాలీ పట్టణ ప్రధానమార్గం, 26వ జాతీయ రహదారి, రాజా పేలస్, మహాత్మా గాంధీ రోడ్డు, నెహ్రూనగర్, డెప్పగుడ గుండా సాగి జిల్లా లేబర్ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా డివిజనల్ లేబర్ కమిషనర్ బృందావన్ సేఽఠి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చైతన్య ప్రసాద్ మఝి, జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చందన కుమార్ నాయిక్ మాట్లాడుతూ.. ఈ ప్రచారం కేవలం సైన్ బోర్డుల కోసమే కాదని.. ఇది మన భాషా పరిరక్షణ కోసమన్నారు. ప్రతి దుకాణం ముందు ఒడియా భాష కనిపించేలా చేస్తే మన సంస్కృతిని గౌరవించిన వార మౌతామని అలాగనే ప్రజలకు సమాచారం సులభంగా అర్థమయ్యేలా ఉంటుందన్నారు. జయపురం సిటీ స్కూలు విద్యార్థుల బృందానికి పాఠశాల ఉపాధ్యాయులు ప్రతాప్ కుమార్ పట్నాయక్, వందితా పాణిగ్రహి, సీహెచ్ మానస పర్యవేక్షించారు.


