పర్లాకిమిడి: జిల్లా స్థాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రవేశ ఉత్సవాలు, పలకాబలపం ఉత్సవాలను ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి స్థానిక మహేంద్రగిరి పురపాలక ఉన్నత పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ ఉత్సవాలకు జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతి రావు, పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, డీఈఓ డాక్టర్ మయాధర్ సాహు, ఎంపీ ప్రతినిధి దారపు చిట్టి, కౌన్సిలర్లు బబునా బెహరా, బాలకృష్ణ పాత్రో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ప్రవేశ ఉత్సవాలపై ప్రచార రథాలను ముఖ్యఅతిథి ఎమ్మెల్యే రూపేష్‌పాణిగ్రాహి చేతులమీదుగా ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ప్రవేశాలు తగ్గి ప్రైవేటు ఇంగ్లిష్ మీడియంలో చేరుతున్నారని, అయితే బి.టెక్, ఎం.బి.బి.యస్. సీట్ల కోసం మాత్రం ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు పోటీ పడుతున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతి రావు అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఉన్నత విద్య ఆవశ్యకతపై డ్యాన్స్ రూపంలో రూపకం ప్రదర్శించారు. కొత్తగా మహేంద్రగిరి ఉన్నత పాఠశాలలో చేరిన ఆరో తరగతి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లతో పాటు పలకా బలపం, పుస్తకాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా జిల్లా ముఖ్య శిక్షాధికారి డాక్టర్ మయాధర్ సాహు అందజేశారు. కార్యక్రమాన్ని మహేంద్రగిరి పురపాలక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పూర్ణ చంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.


