భువనేశ్వర్:
రాజధాని వ్యవస్థాపక దినోత్సవ సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రమేష్ చంద్ర జెనా అధ్యక్షతన స్థానిక క్యాపిటల్ హైస్కూల్ ఆడిటోరియంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ నెల 13, 14 తేదీల్లో జరగనున్న 78వ రాజధాని వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు వివిధ కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. 13వ తేదీ ఉదయం పాఠశాల, కళాశాల విద్యార్థులచే ప్రదర్శన పరేడ్, కాగడా శోభాయాత్ర నగరంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తారు. ఈ రెండు రోజులు సాయంత్రం వేళల్లో స్థానిక ఉత్కల్ మండపంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విశేష సేవలు అందించిన ప్రముఖులను రాజధాని గౌరవ్ సమ్మాన్‌తో సత్కరిస్తారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థుల మధ్య సాంస్కృతిక పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. రాజధాని వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని ప్రతి ప్రభుత్వ భవనం విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. సమావేశానికి రాజధాని వ్యవస్థాపక దినోత్సవ వేడుకల కమిటీ చైర్మన్ ప్రదోష్ పట్నాయక్, ఉపాధ్యక్షులు ప్రద్యుమ్న మహంతి, ప్రధాన కార్యదర్శి సనత్ మిశ్రా, బీఎంసీ అదనపు కమిషనర్ స్మృతి స్వంయి, భువనేశ్వర్ మండల విద్యాధికారి బ్రహ్మానంద రౌత్, క్యాపిటల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ సత్య సుందర్ దాస్, ఎస్. కె. అబ్దుల్లా జనాబ్, ఒలింపియన్ ద్యుతీ చాంద్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.


