బీజేడీకి జిల్లా ఉపాధ్యక్షుని గుడ్ బై
రాయగడ: బీజేడీ పార్టీకి జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్ సావుంతా రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగన్నాథ సరక, రాష్ట్ర శాఖ సాధారణ కార్యదర్శి సుధీర్ దాస్‌లకు పంపించారు. కొద్ది రోజుల కిందట బీజేడీ అధినేత రాయగడ జిల్లాకు కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఆ జాబితాలో జిల్లా ఉపాధ్యక్షునిగా నియమితులైన సావుంతా పదవిలో కొద్ది రొజులు మాత్రమే కొనసాగిన తర్వాత ఆ పార్టీకి రాజీనామ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాయగడ శాసన సభ పరిధిలో గల కాశీపూర్‌లో అత్యంత కీలకమైన పార్టీ నాయకుడిగా పనిచేస్తున్న సావుంతా రాజీనామా చేయడంతో పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. బీజేడీ పార్టీలో అవిభక్త కొరాపుట్ జిల్లాలోనే మంచి పట్టుఉన్న రాజ్యసభ మాజీ ఎంపి నెక్కంటి భాస్కరరావు ఇదివరకే పార్టీకి గుడ్‌బై చెప్పి బిజు స్వాభిమాన్ మంచ్ ను ఏర్పాటు చేశారు. దీంతో ఈ జిల్లాలొ ఆయన లేని కొరత పార్టీకి కొట్టొస్తున్నట్లు కనబడుతుంది. ఈ నేపథ్యంలో బీజేడీ జిల్లాలో ఉనికి కోల్పోయే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. బీజేడీ జిల్లా అధ్యక్షుడు జగన్నాధ సరక పార్టీని ఏ దిశవైపు నడిపించుకుని వెళ్తారో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


