ఘనంగా నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు
● గజవాహనంపై ఊరేగిన స్వామివారు ● నేటితో ముగియనున్న ఉత్సవాలు
రాయగడ: అమలాభట్ట సమీపంలోని శ్రీక్షేత్ర టౌన్‌షిప్‌లో గల శ్రీనృసింహస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు ఆఖరి ఘట్టానికి చేరుకుంటున్నాయి. ఈ నెల ఐదో తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాలు మంగళవారంతో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో స్వామి వారికి ఆదివారం గజవాహనంపై ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత వైభోగంగా నిర్వహించారు. ప్రత్యేకంగా స్వామివారి ఉత్సవ మూర్తిని అలంకరించి గజవాహనంపై వేదపండితులు మంత్రోచ్ఛరణల మధ్య కూర్చొబెట్టారు. అనంతరం స్వామి వారికి మందిరం చుట్టూ ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామి వారి ఊరేగింపు ఉత్సవాన్ని కనులారా వీక్షించారు. స్వామి వారి పాద స్పర్శకు భక్తులు పోటీపడ్డారు. వేద పండితులు భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం కల్పించడంతో పాటు గజవాహంపై ఆశీనులైన స్వామి వారి పాదాల చెంత ఉన్న పుష్పాలు, అక్షితలను వారిపై వేసి ఆశీర్వాదాలు పలికారు.
శ్రీలక్ష్మీ హయగ్రీవ హోమం
ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం శ్రీలక్ష్మీ హయగ్రీవ హోమాన్ని చేపట్టారు. వేదపండితులు నిర్వహించిన హోమంలొ భాగంగా చిన్న పిల్లలను కూర్చొబెట్టారు. హోమం వద్ద పుస్తకాలు,పెన్నులు, పెన్సిళ్లు ఉంచిపూజించారు. అనంతరం వాటిని పిల్లలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా భక్తి, బుద్ధి అనే అంశంపై వేదపండితులు ఫణిహారం భాస్కరాచార్యులు వివరించారు. చదువుతో పాటు విద్యార్థులు ఆధ్యాత్మికతపై కూడా శ్రద్ధ కనబరచాలన్నారు. మన హైందవ సంప్రదాయాలను, సంస్కృతిని వారికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఇటువంటి కార్యక్రమాల్లో పిల్లలకు కూడా అవకాశం కల్పిస్తుండటం శుభపరిణాంగా అభివర్ణించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు.
ఘనంగా నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు
ఘనంగా నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు
ఘనంగా నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు


