జాగరణ దర్శనం క్రమబద్ధీకరణకు సన్నాహాలు
భువనేశ్వర్: పవిత్ర మహా శివరాత్రి పురస్కరించుకుని స్థానిక ఏకామ్ర క్షేత్రంలో లింగ రాజ్ మహా ప్రభువు క్రమబద్ధమైన ఆచారాలు, ఆరాధనకు సంబంధించిన కార్యకలాపాల సన్నద్ధతని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్ సమీక్షించారు. ఆమె అధ్యక్షతన లోక్ సేవా భవన్ సమావేశం గదిలో జరిగిన సమావేశంలో లింగ రాజ్ ఆలయంలో ఉత్సవ పూజాదుల్లో సమయ పాలన, భక్తులకు సులభ దర్శనం క్రమబద్ధీకరణ అంశాలపై చర్చించారు. ప్రధానంగా జాగర ఉత్సవాన్ని సజావుగా నిర్వహించడంపై ప్రధాన కార్యదర్శి అను గార్గ్ దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 15న జాగర ఉత్సవం సమయంలో భారీ సంఖ్యలో జన సమూహం తరలి వచ్చే అవకాశం ఉందని, భగవంతుని ఆచారాలలో తేలికపాటి నిర్లక్ష్యం భక్త జన మృదయాలను తీవ్రంగా కలచివేస్తుందని అన్నారు. జాగరణ రోజున భక్తులందరికి లింగ రాజ్ దర్శనం కల్పించడంలో రద్దీ నియంత్రణ పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, అగ్నిమాపక దళం, లింగరాజు ఆలయ సేవకులు, స్వచ్ఛంద సేవకులు, ప్రజల ఉమ్మడి సమన్వయ, సహకారంతో నిర్వహించాలని కోరారు. క్రమబద్ధమైన దర్శనం కోసం రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని ప్రధాన కార్యదర్శి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఉత్సవ ఆచారాలను సకాలంలో పూర్తి చేసి ఆలయం లోపల తగినంత కాంతి, వాయు ప్రసరణతో ఉక్కిరి బిక్కిరి పరిస్థితి నివారించాలన్నారు. అగ్నిమాపక భద్రతా వ్యవస్థ, ఆకస్మిక అనారోగ్య పరిస్థితుల్లో తక్షణ చికిత్స కోసం అనుబంధ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి వివిధ టీవీ, రేడియో, దిన పత్రికలు మరియు మైక్ ద్వారా సమాచారాన్ని ప్రసారం చేయడం అవసరమన్నారు. సమావేశంలో న్యాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పవిత్ర మోహన్ సామల్, పోలీస్ కమిషనర్ ఎస్.దేవదత్త సింగ్, దేవాదాయ శాఖ కమిషనర్ లలాటేందు జెనా, అదనపు పోలీస్ కమిషనర్ నరసింహ భోల్, న్యాయ శాఖ అదనపు కార్య నిర్వాహక కార్యదర్శి శివ ప్రసాద్ మహా పాత్రో, భువనేశ్వర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రమేష్ కుమార్ జెనా తదితర ప్రముఖులు పాల్గొన్నారు.


