19 మంది మావోల లొంగుబాటు
భువనేశ్వర్: రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాల పూర్తి నిర్మూలనలో ఘన విజయం సాధించామని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా విలేకర్లకు తెలిపారు. ఈ ఏడాది మార్చి 31 లోపు రాష్ట్రంలో మావోయిజం పూర్తిగా నివారించడం లక్ష్యంగా పేర్కొన్నారు. హింస మార్గాన్ని విడిచిపెట్టి సమాజంలో చేరడానికి సిద్ధంగా ఉన్న మావోయిస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పునరావాస విధానాన్ని అమలు చేసింది. ఈ విధానం ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులు ప్రభుత్వ సౌకర్యాలు, భద్రత, గౌరవప్రదమైన భవిష్యత్‌కు అవకాశం పొందుతారు. హింస మార్గాన్ని విడిచిపెట్టి సమాజంలోని ప్రధాన స్రవంతిలో చేరి ఈ సదుపాయాలను పొందాలని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో, రాయగడ జిల్లా పోలీసుల ముందు 15 మంది మావోయిస్టులు, కంధమల్ జిల్లా పోలీసుల ముందు నలుగురు మంది మొత్తం 19 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ విలేకరుల సమావేశంలో తెలియజేశారు.
రాయగడ జిల్లా: రాయగడ జిల్లాలో వంశధార – ఘుముసర్ – నాగావళి (బీజీఎన్) డివిజన్‌కు చెందిన మొత్తం 15 మంది మావోయిస్టు కేడర్లు లొంగిపోయారు. వారిలో 2 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు నిఖిల్ అలియాస్ నిరంజన్ రౌత్ (జగత్‌సింగ్‌పూర్) మరియు అంకిత అలియాస్ రష్మిత లెంకా (టంగి, కటక్) ఉన్నారు. వారి పేర్లపై రూ. 55 లక్షల బహుమానం ప్రకటించారు.
వీరితో పాటు బీజీఎన్ డివిజన్‌కు చెందిన మరో 13 మంది కేడర్లు కూడా లొంగిపోయారు. వారి నుంచి మొత్తం 14 ఆధునిక తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. 2 ఏకే 47, 5 ఎస్‌ఎల్‌ఆర్, 1 స్టెన్, 1 ఐఎన్‌ఎస్‌ఏఎస్, ఒక 303 రైఫిల్, 4 సింగిల్ షాట్ గన్‌లు స్వాధీనం చేసుకున్నారు. రాయగడ, గజపతి, కంధమల్ ప్రాంతాల్లో నిఖిల్ అలియాస్ నిరంజన్ రౌత్ రెండు దశాబ్దాలకు పైగా మావోయిజం కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నాడని పేర్కొన్నారు.
కంధమాల్ జిల్లా: కలహండి, కంధమల్, బౌధ్, నయాగఢ్ (కేకేబీఎన్) డివిజన్‌కు చెందిన 4 మంది పార్టీ సభ్యులు (పీఎం) మావోయిస్టు కార్యకలాపాలకు స్వస్తి పలికి హింసా మార్గాన్ని విడిచిపెట్టారు. వారంతా కంధమల్ జిల్లా పోలీసుల ముందు లొంగిపోయారు. లొంగిపోయే సమయంలో వారు తమ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర వస్తువులను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన (కేకేబీఎన్) డివిజన్ పార్టీ సభ్యుల్లో (పీఎం) జిటెన్ అలియాస్ గంగా కుంజామి, సుమిత్ర అలియాస్ ముచాకి మాసే, శాంతిల అలియాస్ చోమాలి కుంజామి మరియు మాలతి అలియాస్ బంధి మాధవి ఉన్నారు. వారి నుంచి ఒక ఎస్‌ఎల్‌ఆర్, ఒక 12 బోర్ గన్, రెండు 303 రైఫిల్ సహా పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ ఠాణాల్లో వారిపై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
గత కొన్ని రోజులుగా వివిధ జిల్లాల్లో నిర్వహించిన ఆపరేషన్ల ద్వారా మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించారు. సీనియర్ కేడర్ మావోయిస్టుల అరెస్టు, లొంగిపోవడంతో పాటు భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ వివరించారు. ఒడిశాను మావోయిస్టు రహితంగా మార్చే దిశగా ఒడిశా పోలీసుల ఈ కార్యాచరణ రాబోయే రోజుల్లో కూడా నిరవధికంగా కొనసాగుతుందని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా విలేకరుల సమావేశంలో వెల్లడించారు.


