కొరాపుట్
● అమాయకత్వమే ఇక్కడి ప్రజల చిరునామా ● పరవ్–25లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి
రాయగడ/కొరాపుట్:
కళలు, భాష, సంస్కృతి సంప్రదాయాలకు చిరునామాగా కొరాపుట్ నిలుస్తోందని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి అన్నారు. కొరాపుట్‌లో జరుగుతున్న పరవ్–25 ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకత్వమే ఇక్కడి ప్రజల చిరునామా అని, జీవన శైలి, ఆచార వ్యవహారాలు అందరినీ మైమరపిస్తుంటాయని చెప్పారు. ఎంతోమంది అమర వీరులకు పుట్టినిళ్లుగా గుర్తింపు పొందిన కొరాపుట్ పారిశ్రామికంగానూ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రకృతి సంపదలకు నియమైన ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. సహీద్ లక్ష్మణ్ నాయక్ వంటి స్వాతంత్ర సమరయోధులకు పుట్టినిళ్లుగా గుర్తింపు పొందిన కొరాపుట్ జిల్లా అన్ని రంగాల్లోనూ ప్రగతి పథంలో పయనిస్తోందని చెప్పారు. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. కొరాపుట్ జిల్లా కాఫీ తొటలకు అనువైన ప్రాంతంగా గుర్తింపు పొందిందన్నారు. వ్యవసాయ రంగంలో ప్రగతి చెందేలా రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. కొట్‌పాడ్‌లో రూపొందుతున్న చేనేత వస్త్రాలు ఎంతో గుర్తింపు పొందాయని చెప్పారు. మిల్లెట్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. జిల్లాలో 71 హెక్టార్ల విస్తీర్ణంలొ మిల్లెట్‌లు సాగవుతున్నాయని వివరించారు.
అభివృద్ధి పనులకు రు.545 కోట్లు..
జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.545 కోట్లు మంజూరు చేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. మంజూరైన నిధులతో సుమారు 86 ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మంజూరైన నిధుల్లో రూ.24 కోట్లతో 16 ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. మరో రూ.521 కోట్లతో 70 ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగిందన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, పారిశ్రామిక ప్రగతి, రహదారులు, మిశన్ శక్తి భవనాల నిర్మాణం, అటవీ సంరక్షణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పరవ్ ఉత్సవాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా రూపొందించిన జాకెట్‌లను సీఎం మాఝి ఆవిష్కరించారు. రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖల మంత్రి గోకులానంద మల్లిక్ మాట్లాడుతూ కొరాపుట్ జిల్లాలోని ఆదివాసీల భాష, సంస్కృతి, కళారంగాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు.
అంబరాన్నంటిన సంబరాలు..
పరవ్–25 ఉత్సవాల్లో భాగంగా జిల్లా యంత్రాంగం సహీద్ లక్ష్మణ్ నాయక్ మైదానంలో నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రదర్శనను ముఖ్యమంత్రి మాఝి ప్రారంభించారు. ఎస్‌హెచ్‌జీ బృందాలకు చెందిన మహిళలు రూపొందించిన వస్తువులను పరిశీలించారు. వ్యవసాయ శాఖ రైతులకు చైతన్యవంతులను చేయడంతో పాటు భూసంరక్షణ వంటి అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన సందర్శించారు. అనంతరం పుష్ప ప్రదర్శన తిలకించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆదివాసీ, హరిజన సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గొండ, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురామ్ మచ్చ, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర సామంత తదితరులు హాజరయ్యారు. విద్యుత్ అలంకరణలతో పరవ్–25 ఉత్సవాలు అంబరాన్ని తాకాయి. కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులను సన్మానించారు.
కొరాపుట్


