ధాన్యం, మొక్కజొన్న మండీలు ప్రారంభించాలని డిమాండ్
జయపురం: కొరాపుట్ జిల్లా కృషక్ కల్యాణ మంచ్ నేతలు జిల్లా సివిల్ సప్‌లై అధికారి జయపురం ద్వారా కొరాపుట్ కలెక్టర్‌కు ఒక మెమొరాండం అందజేశారు. వెంటనే ధాన్యం, మొక్కజొన్న మండీలు ప్రారంభించి మండీలలో సమస్యలను పరిష్కరించాలని మెమొరాండంలో డిమాండ్ చేశారు. జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న అతి తక్కవ ధరలకు రైతులు అమ్మే పరిస్థతి నెలకొందని వారు కలెక్టర్‌కు తెలిపారు. మండీలు ప్రారంభించి రైతుల నుంచి ధాన్యం, మొక్కజొన్నలు ప్రభుత్వ మద్దతు ధరకు కొనాలని డిమాండ్ చేశారు. ఈ నెల 11 వ తేదీన మండీలు ప్రారంభించినా నేటి వరకు ఒక కిలో ధాన్యం కూడా కొనలేదని తెలిపారు. రైతులందరికీ టోకెన్లు అందించాలని, జనవరి 2026 నాటికి రైతుల వద్ద ఉన్న ధాన్యం, మొక్కజొన్నలు పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అందుకు టోకెన్ ల గడువు పెంచాలని విజ్ఞప్తి చేశారు. మండీల్లోనే ధాన్యం తూకం వేయాలని అలాగే ధాన్యం కొనుగోలు చేసిననాడే రైతుకు వెండర్ రశీదు ఇవ్వాలని కోరారు. కొనుగోలు సంస్థలు లేదా సివిల్ సప్‌లై కార్పొరేషన్‌లు మండీలలో ఖాళీ గోనెలు, హ్యాండిలింగ్ చార్జీలు రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు. గతంలో బకాయి ఉన్న డబ్బులు చెల్లించాలన్నారు. ధాన్యం కొన్న తర్వాత రైతుల వద్ద మిగిలి ఉన్న ధాన్యం కూడా ప్రభుత్వమే కొనాలని, ఎఫ్‌ఎక్యూ పేరుతో రైతుల నుంచి అధిక ధాన్యం తీసుకోవడం ఆపాలని కోరారు. కొరాపుట్ పర్వ్ ప్రారంభానికి ముందే మండీలు ప్రారంభించాలని జిల్లా కృషక్ కళ్యాణ మంచ్ జిల్లా కార్యదర్శి నరేంద్ర కుమార్ ప్రధాన్ జిల్లా సివిల్ సప్లై అధికారికి అందజేసిన మెమోరాండంలో డిమాండ్ చేశారు.
ధాన్యం, మొక్కజొన్న మండీలు ప్రారంభించాలని డిమాండ్


