ఆశ్రమ పాఠశాలలో బోర్డు కూలి విద్యార్థి మృతి
కొరాపుట్: ఆశ్రమ పాఠశాలలో ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం కొరాపుట్ జిల్లా కొట్‌పాడ్ సమితి గాంధీ నగర్ ఆశ్రమ పాఠశాలో సిమెంట్ బోర్డు కూలి 3వ తరగతి విద్యార్థి ప్రేమానంద బోత్ర (7) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే బోర్డు కింద పడి మరో విద్యార్థి కాలు విరగ్గా, ఇంకో విద్యార్థి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన ఉదయం 6 గంటలకు జరగగా 11 వరకు విద్యార్థులను సంఘటన స్థలం నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడం అనుమానాలకు తావిస్తోంది. క్షతగాత్రులను కొట్‌పాడ్ ఆస్పత్రికి తరలించగా ప్రేమానంద బోత్ర మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. క్షతగాత్ర విద్యార్థులు కిరణ్ బోత్ర, సన్న బోత్రలను జయపూర్ లోని కొరాపుట్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. విషయం తెలిసి ప్రతిపక్ష బీజేడీకి చెందిన నబరంగ్‌పూర్ మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆశ్రమ తలుపులు తెరవకపోవడంతో కొట్‌పాడ్ జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. సోషల్‌మీడియా ద్వారా సమాచారం రావడంతో మాజీ మంత్రి పద్మిని దియాన్, మాజీ ఎమ్మెల్యే చంద్ర శేఖర్ మజ్జి, కొరాపుట్ జిల్లా బీజేడి వర్కింగ్ ప్రెసిడెంట్ రాస్తారోకోలో పాల్గొన్నారు. అధికారులు సైతం సంఘటన స్థలానికి చేరుకున్నారు.
రాస్తారోకోలో ప్రదీప్ మజ్జి మాట్లాడుతూ విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది హత్యగా అభివర్ణించారు. గత 3 నెలల్లో 9 మంది గిరిజన విద్యార్థులు ఆశ్రమాల్లో మృతిచెందారని తెలిపారు. ఈ ఘటనలకు బాధ్యత వహించి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గొండో రాజీనామా చేయాలన్నారు. ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మజ్జి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం మల్కన్ గిరి జిల్లాలో గిరిజన మహిళను హత్య చేసి తలను మొండెం నుండి వేరు చేసినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు లేవని ప్రదిప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో జాతీయ రహదారి పై వందలాది వాహనాలు నిలిచి పోయాయి.


