సమన్వయంతో సర్వే చేపట్టాలి
పాతపట్నం: అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రీ సర్వే పూర్తి చేయాలని జిల్లా అటవీశాఖ భూసెటిల్‌మెంట్ అధికారి ఎం.లావణ్య సూచించారు. పాతపట్నం ఫారెస్ట్ పరిధిలోని అంతరాబ రిజర్వు ఫారెస్ట్, పాతపట్నం రెవెన్యూ భూములకు ఆనుకుని ఉన్న స్థలాలను బుధవారం పరిశీలించారు. పాతపట్నం రెవెన్యూ పరిధిలో కొంత అటవీ భూముల్లో ఆక్రమణలను గుర్తించారు. రీ సర్వేలో వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో రీ సర్వే చేపట్టి శాఖల పరంగా హద్దులు నిర్ణయించుకోవాలన్నారు. కార్యక్రమంలో అటవీ రేంజర్ పి.అమ్మన్నాయుడు, తహసీల్దార్ ఎన్.ప్రసాదరావు, మండల సర్వేయర్ మహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.


