పారిశ్రామిక రంగంలో పురోగతి
రాయగడ: పారిశ్రామిక రంగంలో జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని జేకేపూర్‌లో గల జేకేపేపర్ మిల్ ఉపాధ్యక్షుడు వినయ్ ద్వివేది అన్నారు. జేకే పేపర్ మిల్ 141 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మిల్ ప్రాంగణంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖనిజ, ప్రాకృతిక సంపదలను వినియోగించడంలో జిల్లా అగ్రస్థానంలో ఉందని అన్నారు. పారిశ్రామిక ప్రగతితోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. 1962లో జేకేపూర్‌లో ఏర్పాటైన జేకే పేపర్ మిల్లు అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సామాజిక రంగంలోనూ సేవలు కనబరిచిందని తెలిపారు. పరిసర ప్రాంతాల అభివృద్ధితో పాటు వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. నాణ్యత విషయంలో జేకే సంస్థలు దేశంలోనే ప్రత్యేకస్థానాన్ని సంపాదించాయని తెలిపారు. అంతకు ముందు జేకే పేపర్ మిల్ వ్యవస్థాపకులు లాలాకమలాపత్ సింఘానియా విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జరిగన సమావేశంలో భాగంగా పేపర్ మిల్‌లో 25, 45 ఏళ్ల సేవలను అందించిన ఉద్యోగులకు ఆయన సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వ్యవస్థాపక వేడుకలకు ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
పారిశ్రామిక రంగంలో పురోగతి
పారిశ్రామిక రంగంలో పురోగతి
పారిశ్రామిక రంగంలో పురోగతి


