కొట్‌పాడ్‌లో సంసద్ ఖేల్ మహోత్సవం ప్రారంభం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్‌లో బుధవారం సంసద్ ఖేల్ మహోత్సవం ప్రారంభించారు. కొట్‌పాడ్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఉత్సవం ప్రారంభమైంది. సంసద్ ఖేల్ మహోత్సవంలో పలు గ్రామ పంచాయతీల నుంచి అనేక మంది క్రీడాకారులు, ఆదివాసీలు శోభాయాత్రలో పాల్గొన్నారు. శోభాయాత్ర ముందుగా కొట్‌పాడ్ ప్రజల ఆరాధ్య దేవి మా మవుళీ మందిరానికి వెళ్లి పూజలు చేశారు. ఆ పూజల్లో కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అక్కడ క్రీడాజ్యోతి వెలిగించారు. ఆయనతో పాటు కొట్‌పాడ్ బీడీఓ మనోజ్ కుమార్ నాయిక్, సమితి సంక్షేమ అధికారి అశోక్ జెన తదితరులు పాల్గొన్నారు.
మైదానంలో ముఖ్య అతిథి రూపు భొత్ర క్రీడా పతకాన్ని ఎగురవేసి సంసద్ ఖేల్ మహోత్సవాలను ప్రారంభించారు. రెండు దినాలు నిర్వహించనున్న ఈ ఖేల్ మహోత్సవాల్లో 17 పంచాయతీల నుంచి వందలాది మంది పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో 100, 200 మీటర్ల పరుగు పందాలు, క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, లాంగ్‌జంప్, హైజంప్ తదితర పోటీలు నిర్వహిస్తారు. క్రికెట్, ఫుట్‌బాల్ పోటీలు భైరవ మైదానంలో నిర్వహిస్తామని మిగతా పోటీలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జరుపనున్నట్లు వెల్లడించారు.
కొట్‌పాడ్‌లో సంసద్ ఖేల్ మహోత్సవం ప్రారంభం
కొట్‌పాడ్‌లో సంసద్ ఖేల్ మహోత్సవం ప్రారంభం


