ప్రభుత్వ స్థలంలో పాగా!
● టెక్కలి కాటాబందలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న స్థానికులు
● మంత్రికి ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన
టెక్కలి : టెక్కలి మేజర్ పంచాయతీ పరిధిలోని కాటాబందలో అయ్యప్పనగర్‌కు వెళ్లే మార్గంలో ప్రభుత్వ స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణ పనులను స్థానికులు ఆదివారం అడ్డుకున్నారు. ఇటీవల పాత జాతీయ రహదారి నుంచి భవానీనగర్ మీదుగా జాతీయ రహదారి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలపై కొంత మంది కన్నుపడింది. ఈ క్రమంలో అయ్యప్పనగర్‌కు వెళ్లే దారిలో ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. వాస్తవానికి, గతంలో పునాదుల స్థాయిలో ఉన్నప్పుడే అయ్యప్పనగర్‌కు చెందిన స్థానికులంతా ఈ అక్రమ నిర్మాణం విషయమై మంత్రికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ నిర్మాణాలను ఆపే విషయంలో అధికారులు పట్టించుకోకపోవడంపై ఆయా అక్రమ నిర్మాణాలు అధికార పార్టీ కార్యకర్తలే చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వైపు పట్టణంలో ప్రభుత్వ స్థలాలకు రక్షకుడిగా ఉంటానంటూ మంత్రి బహిరంగ సభల్లో ప్రస్తావిస్తూ, మరో వైపు పట్టణం నడిబొడ్డున ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అక్రమ నిర్మాణానికి ఆనుకుని అయ్యప్పనగర్ రోడ్డు నిర్మాణానికి గతంలో ఇదే మంత్రి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆయా శిలాఫలకాలకు ఆనుకునే అక్రమ నిర్మాణం జరుగుతోంది. దీనిపై మంత్రితో పాటు స్థానిక రెవెన్యూ, పంచాయతీ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను ఆపాలని స్థానికులు కోరుతున్నారు. కాగా, సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ రాము తన సిబ్బందితో నిర్మాణ స్థలం వద్దకు చేరుకుని ఆయా పనులు ఆపాలని ఆదేశించారు.
అయ్యప్పనగర్‌కు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఆనుకుని అక్రమంగా దుకాణాల నిర్మా ణం చేస్తున్నారు. గతంలో మంత్రి అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశాం. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ రోజు శ్లాబ్ నిర్మాణం చేసేందుకు సిద్ధమయ్యా రు. కాలనీవాసులంతా కలిసి వాటిని అడ్డుకున్నాం.
– టి.వైకుంఠరావు, అయ్యప్పనగర్, టెక్కలి
కాలనీకు వెళ్లే మార్గంలో దర్జాగా ప్రభుత్వ స్థలంలో అక్రమంగా దుకాణాలు నిర్మాణం చేపడుతున్నారు. దీనిపై అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. గతంలో మంత్రి అచ్చెన్నాయుడుకూ ఫిర్యాదు చేశాం. అక్రమ నిర్మాణాలు ఆపకపోతే ఊరుకునేది లేదు.
– ఎం.హేమసుందర్, అయ్యప్పనగర్, టెక్కలి
ప్రభుత్వ స్థలంలో పాగా!
ప్రభుత్వ స్థలంలో పాగా!
ప్రభుత్వ స్థలంలో పాగా!


