అపరాల కొనుగోళ్లపై దృష్టిసారించాలి
పర్లాకిమిడి: అపరాల కొనుగోళ్లపై సిబ్బంది దృష్టిసారించాలని అధికారులు అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ల్లో గజపతి జిల్లా స్థాయి రాగులు, పప్పుదినుసుల ప్రొక్యూర్‌మెంట్ కమిటీ సమావేశం మంగళవారం ఉదయం జరిగింది. ముఖ్యఅతిథిగా ఇన్‌చార్జి కలెక్టర్ మునీంద్ర హానగ, జిల్లా సమగ్ర గిరిజనాభివృద్ధి శాఖ పీవో అంశుమాన్ మహాపాత్రో, జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి ఎం.ప్రకాశరావు, డీడబ్ల్యూవో సాల్మన్ రైకా, జిల్లా ఇండస్ట్రీస్ జీఎం సునారాం సింగ్, జిల్లా జీవనోపాదుల శాఖ డీఎం టిమోన్ బోరా, మహిళా ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో రాగులు పంట అత్యధిక మోహానా, గుమ్మ, ఆర్.ఉదయగిరి, రాయఘడ, నువాగడ సమితిల్లో సాగు చేస్తున్నారని ఐటీడీఏ అధికారి అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ మద్దతు ధర రూ.48.86 పైసలు ఉందని వివరించారు. కందులు, బొబ్బర్లు, చిక్కుడుగింజలు, మినప, పెసర తదతర పప్పుదినుసులను టీడీసీసీ ద్వారా కొనుగోలు చేసి మహిళా ఎస్‌హెచ్‌జీకి అప్పగించాలన్నారు. సమితి స్థాయిలో రాగులు ఎంత ధర పలుకుతున్నాయో బీడీవోల ద్వారా సమాచారం సేకరించాలని ఇన్‌చార్జి కలెక్టర్ మునీంద్ర హానగ సూచించారు.
అపరాల కొనుగోళ్లపై దృష్టిసారించాలి


