బెనాడంగలో రెండు గుడిసెలు దగ్ధం
రాయగడ: సదరు సమితి పరిధిలోని బైరాగి హలువ పంచాయతీ బెనాడంగ గ్రామంలో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పసయ్య పువ్వల అనే ఆదివాసీ రైతుకు చెందిన రెండు పూరిగుడిసెలు దగ్ధమయ్యాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది చేరుకోలేకపొవడంతో రెండు గుడెసలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రెండు లక్షల రూపాయల విలువ చేసే సామగ్రి, ధాన్యం బస్తాలు కాలి బూడి దయ్యా యని బాధితుడు పసయ్య పువ్వల ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.
ముగిసిన మహాలక్ష్మి నిమజ్జనోత్సవాలు
రాయగడ : మునిగుడలోని పాయికొ వీధిలో గత నెల 22 నుంచి కొనసాగుతున్న మహాలక్ష్మీ పూజలు సోమవారంతో ముగిశాయి. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించి నాగావళి నదిలో నిమజ్జనం చేశారు. 38 ఏళ్లుగా ఇక్కడ పూజలు నిర్వహిస్తుండటం విశేషం.
గంజాయి స్వాధీనం
రాయగడ : స్థానిక రైల్వేస్టేషన్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు గంజాయి స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 6.140 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తమిళనాడుకు చెందిన అనంత సుభాష్‌చంద్ర బొష్, నిషాంతలుగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. రైల్వే డీఎస్పీ ప్రభాత్ కుమార్ త్రిపాఠి నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్ బి.ప్రకాష్, అలొక్ నాయక్, ఏఎస్‌ఐ మానిక్ చంద్రగౌడొ, సుభేందు పాల్గొన్నారు.
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ ఎన్‌ఏసీలో వారణాసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని బడిక మహి (15) తరగతి గదిలోనే మంగళవారం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపాస్మరక స్థితిలో పడిపోవడంతో క్లాస్ టీచర్ గమనించి వెంటనే ప్రధాన ఉపాధ్యాయునికి తెలియజేసి పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి బడిక మహి తన తల్లితో ఏదో విషయంపై గొడవ పడి ఉదయం అల్పాహారం తినకుండా కాశీనగర్‌లో వారణాసి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిపోయింది. తరువాత ఈ అఘాయిత్యానికి పాల్పడింది. సమాచారం తెలుసుకున్న తల్లి 11 గంటల సమయంలో పాఠశాల వద్దకు చేరుకుంది. ప్రస్తుతం బడిక మహి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలియజేశారు. దీనిపై కాశీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
రాయగడ: చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లిగాం వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుడు కళ్యాణసింగుపూర్ సమితిలోని చాంచల్యగుడ గ్రామానికి చెందిన అనంతరావు కడ్రక(43)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తనసొంత పనిమీద వస్తున్న కడ్రకను ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.


